‘అనుజ్ఞాన్’ న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ సక్సెస్..ఐఐటీ హైదరాబాద్, క్రిమ్సన్ ఎనర్జీ ఆధ్వర్యంలో శిక్షణ

‘అనుజ్ఞాన్’  న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ సక్సెస్..ఐఐటీ హైదరాబాద్,  క్రిమ్సన్ ఎనర్జీ ఆధ్వర్యంలో శిక్షణ

మెదక్/సంగారెడ్డి, వెలుగు: ఐఐటీ హైదరాబాద్ లో నిర్వహించిన 'అనుజ్ఞాన్' న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ (ఎన్టీవోపీ) విజయవంతంగా పూర్తి అయ్యింది. శిక్షణ పూర్తి చేసిన 23 మందికి ఐఐటీ హైదరాబాద్, క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్ సంయుక్తంగా సర్టిఫికెట్ ప్రదానం చేశాయి.

 ప్రోగ్రామ్ ద్వారా అణుశక్తి విభాగం (డీఏఈ) పరిధిలోని సంస్థల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించారు. సోమవారం ముగింపు వేడుకలకు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి అధ్యక్షత వహించగా, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ ఘనశ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 భారత అణుశక్తి లక్ష్యాలను సాధించడానికి ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యం కలిగిన మానవవనరులు కూడా అవసరమని ఘనశ్యామ్ ప్రసాద్ అన్నారు. 'అనుజ్ఞాన్' వంటి కార్యక్రమాలు అణుశక్తి రంగానికి అవసరమైన నిపుణులను తయారు చేస్తాయన్నారు. ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి మాట్లాడుతూ అణు సాంకేతిక రంగంలో 23 మంది ఇంజినీర్లు తొలి బ్యాచ్​లో విజయవంతంగా శిక్షణ  పూర్తి చేయడం ప్రోత్సాహకరమైన మైలురాయి అని అన్నారు. 

క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్,  న్యూక్లియర్ ప్రెసిడెంట్, కమోడోర్ (రిటైర్డ్) ఆర్.డి.మానే మాట్లాడుతూ తరగతి గది బోధనకే పరిమితం కాకుండా, అణు ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌లో ఆచరణాత్మక అంశాలు, వివిధ విభాగాల మధ్య సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించినట్టు చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్ శాస్త్రవేత్త పద్మశ్రీ చైతన్యమోయ్ గంగూలీ, ప్రముఖ అణు శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ చంద్రకాంత్ పిఠావా తదితరులు పాల్గొన్నారు.