- ముగ్గురు బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్
- దేశవ్యాప్తంగా 72 మందిపై క్రిమినల్ కేసులు
- దేశంలో నాలుగో స్థానంలో తెలంగాణ
- 10 మంది ఎంపీలతో ఉత్తరప్రదేశ్ టాప్
- రిచెస్ట్ ఎంపీగా బండి పార్థసారథి రెడ్డి
- బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఏఐసీసీ చీఫ్ ఖర్గేపైనా కేసులు: ఏడీఆర్ రిపోర్ట్
- ఏడీఆర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీల్లో ఐదుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రముఖ ఎలక్షన్ వాచ్ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.
బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి,దీవకొండ దామోదర్ రావు, కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌పై కేసులు ఉన్నట్లు సోమవారం విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. "క్రిమినల్ కేసులున్న రాజ్యసభ ఎంపీల జాబితాలో రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 10 మంది ఎంపీలతో యూపీ మొదటి స్థానంలో ఉండగా, బీహార్ (7), తమిళనాడు (6) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎంపీలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలు విడుదల చేసింది.
పెద్దల సభలో 31% మందిపై కేసులు
రాజ్యసభలోని 230 మంది సిట్టింగ్ ఎంపీల్లో 72 మంది (31 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. వీరిలో 37 మంది (16 శాతం)పై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఒక ఎంపీపై హత్య కేసు, నలుగురిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్, బీజేపీ చీఫ్‌లు మల్లికార్జున ఖర్గే, నితిన్ నబీన్ పైనా కేసులున్నట్టు ఏడీఆర్ తెలిపింది.
కేసులతో పాటు వేల కోట్ల ఆస్తులు
క్రిమినల్ కేసులున్న బీఆర్ఎస్ ఎంపీలు ఆస్తుల్లోనూ దేశంలోనే ముందు వరుసలో ఉన్నారు. పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీల ఆస్తుల విలువ రూ.5,524 కోట్లు. బీజేపీకి చెందిన 111 మంది ఎంపీల ఆస్తులు రూ.8,270 కోట్లు కాగా, పార్టీల వారీగా బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్‌కు చెందిన 29 మంది ఎంపీల ఆస్తులు రూ.3,781 కోట్లు. బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి రూ.5,300 కోట్లతో రాజ్యసభలోనే అత్యంత ధనవంతుడైన ఎంపీగా నిలిచారు.
పంజాబ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజిందర్ గుప్తా (రూ.5,053 కోట్లు), తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ (రూ.2,558 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తెలంగాణ నుంచి ఉన్న ఏడుగురు ఎంపీల మొత్తం ఆస్తులు రూ.8,310 కోట్లు కాగా, దేశంలో ఇదే అత్యధికం. వీరిలో నలుగురు బిలియనీర్లు (రూ.100 కోట్లకు పైగా ఆస్తి ఉన్నవారు).
17 మంది పార్టీ చేంజ్
ఈ ఏడాది అక్టోబర్ 15 నాటికి 17 మంది సిట్టింగ్ రాజ్యసభ ఎంపీలు పార్టీలు మారారని ఏడీఆర్ తెలిపింది. ఏడుగురు ఆప్ నుంచి బీజేపీలో చేరగా, తొమ్మిది మంది ఏఐటీసీ నుంచి ఎంఏఐటీసీకి మారారు. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 113, కాంగ్రెస్‌కు 30 మంది సభ్యులు ఉండగా, బీఆర్ఎస్కు ముగ్గురు ఎంపీలు ఉన్నారు.
