- ఐదు భారీ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) సైతం
- వరల్డ్ బ్యాంకు ఫండ్ 70 శాతం, ప్రభుత్వ వాటా 30 శాతం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ నిర్మాణానికి రూ.925 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఈ మేరకు అర్బన్ చాలెంజ్ ఫండ్ స్టేట్ మిషన్ డైరెక్టర్ టీకే శ్రీదేవి గత నెల 28న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ జాబ్స్ ప్రోగ్రామ్ (టీయూటీజేపీ) కింద ఇంటిగ్రేటెడ్ అండర్‌గ్రౌండ్ సీవరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ (ఐయూజీఎస్‌ఎస్‌పీ)కి ఆమోదం తెలిపారు. మొత్తం రూ.925 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో ప్రపంచ బ్యాంకు 70 శాతం నిధులు అంటే రూ.647.50 కోట్లు సమకూర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 30 శాతం అంటే రూ.277.50 కోట్లు కేటాయించనుంది.
858 కి.మీ. యూజీడీ.. 5 ఎస్టీపీలు
మంచిర్యాల మున్సిపాలిటీని 2025 జనవరిలో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో నస్పూర్ మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నంనూర్, నర్సింగాపూర్, పోచంపాడ్, కొత్తపల్లి, చందనాపూర్ గ్రామాలను విలీనం చేశారు. దీంతో కార్పొరేషన్ పరిధి 162 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది.
ఇంటిగ్రేటెడ్ అండర్‌గ్రౌండ్ సీవరేజ్ సిస్టమ్ ప్రాజెక్టులో భాగంగా కార్పొరేషన్ పరిధిలో 858 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్లు నిర్మించనున్నారు. మురుగునీటిని శుద్ధి చేసేందుకు ఐదు ప్రాంతాల్లో భారీ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మంచిర్యాల మార్కెట్ ఏరియాలో రూ.78 కోట్లతో రోడ్ల విస్తరణ, భూగర్భ డ్రైనేజీ, కేబుల్ వ్యవస్థ నిర్మాణం, సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి.
తీరనున్న డ్రైనేజీ కష్టాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణకు భూగర్భ మురుగునీటి వ్యవస్థ కీలకంగా మారుతోంది. నివాస సముదాయాలు, వాణిజ్య సంస్థల నుంచి వెలువడే మురుగునీటిని భూగర్భ పైప్‌లైన్ల ద్వారా ఎస్టీపీలకు తరలించి శుద్ధి చేస్తారు.
శుద్ధి చేసిన నీటిని పార్కులు, గార్డెనింగ్, రోడ్ల శుభ్రత, నిర్మాణ పనులు, పరిశ్రమల అవసరాలకు తిరిగి వినియోగించుకోవచ్చు. ఈ వ్యవస్థలో భాగంగా రోడ్ల కింద శాశ్వత భూగర్భ పైపులు ఏర్పాటు చేసి, ప్రతి ఇంటి మురుగునీటి కనెక్షన్‌ను వాటికి అనుసంధానిస్తారు.
పైప్‌లైన్ల నిర్వహణ, అడ్డంకుల గుర్తింపు, శుభ్రత కోసం నిర్ణీత దూరాల్లో మ్యాన్‌హోల్స్ నిర్మిస్తారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి వస్తే బహిరంగ మురుగు కాలువల సమస్య తగ్గుతుంది. ఈగలు, దోమల వృద్ధిని అరికట్టడంతో పాటు మలేరియా, డెంగ్యూ, కలరా వంటి వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు అవకాశం ఉంటుంది. మురుగునీరు నేరుగా భూగర్భ జలాలు, చెరువులు, వాగులు, నదుల్లో కలవకుండా నిరోధించవచ్చు. అలాగే దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది.
ప్రాజెక్టు వివరాలు
- కార్పొరేషన్ వైశాల్యం: 162 చ.కి.మీ.
- భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్: 858 కి.మీ.
- భారీ ఎస్టీపీలు: 5
- ప్రాజెక్టు వ్యయం: రూ.925 కోట్లు
- ప్రపంచ బ్యాంకు వాటా: రూ.647.50 కోట్లు
- రాష్ట్ర ప్రభుత్వ వాటా: రూ.277.50 కోట్లు
