గ్రేటర్‍ వరంగల్లో హైటెక్‍ ఆర్‍యూబీ..వర్షమొస్తే తడవకుండా వంతెన పొడవునా బ్రిడ్జిపై రూఫ్‍

గ్రేటర్‍ వరంగల్లో హైటెక్‍ ఆర్‍యూబీ..వర్షమొస్తే తడవకుండా వంతెన పొడవునా బ్రిడ్జిపై రూఫ్‍
  • రూ.4 కోట్ల 60 లక్షలతో వరంగల్‍ జాన్‍పాక ట్రాక్‍ వద్ద నిర్మాణం
  • రాష్ట్రంలోనే మొదటి  హైటెక్‍ రైల్వే అండర్‍ బ్రిడ్జి

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్​లోని జాన్​పాక వద్ద నిర్మించిన హైటెక్‍ మినీ రైల్వే అండర్‍ పాస్‍ బ్రిడ్జి (ఆర్‍యూబీ) అందుబాటులోకి వచ్చింది. వరంగల్​ నుంచి నర్సంపేట వెళ్లే మార్గంలో అత్యాధునిక పద్ధతిలో నిర్మించిన ఈ బ్రిడ్జి నగరవాసులను ఆకట్టుకుంటోంది. వాహనదారులు సొరంగ మార్గంలో ప్రయాణించినట్టు ఫీల్ అవుతారు.

రూ.4.60 కోట్లతో నిర్మాణం..  

రైల్వే శాఖ 'లిమిటెడ్‍ హైట్‍ సబ్‍వే' (ఎల్‍హెచ్‍ఎస్‍) లేదా ‘రోడ్‍ అండర్‍ బ్రిడ్జి’ (ఆర్‍యూబీ) పిలిచే ఈ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే (ఎస్‍సీఆర్‍) రూ.4.60 కోట్లు ఖర్చు చేసింది. జాన్​పాక సెంటర్​ మీదుగా స్తంభంపల్లి, చింతల్​ ప్రాంతాలతోపాటు పలు గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడనున్నది.  

ఎండా, వానను తట్టుకునేలా.. 

మినీ రైల్వే అండర్‍ పాస్‍ బ్రిడ్జిలు మాములుగా చాలాచోట్ల 15 నుంచి 30 మీటర్ల పరిధిలో ఉండగా, జాన్‍పాక వద్ద నిర్మించిన ఆర్‍యూబీ సుమారు 350 నుంచి 400 మీటర్ల పొడవున నిర్మించారు. ఎండా, వానలను నుంచి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా మొదటి నుంచి చివరి వరకు బ్రిడ్జి పైభాగంలో బ్లూ కలర్‍ రేకులతో కప్పు నిర్మించారు. 

పగటిపూట వెలుతురు వచ్చేలా తెల్లని రేకులు, రాత్రి వేళ కాంతి కోసం హైమాస్ట్​ లైట్లు ఏర్పాటు చేశారు. వానాకాలంలో నీరు నిల్వ ఉండకుండా నాణ్యమైన మోటార్లు బిగించారు. వరద నీటిని ఒడిసిపట్టేలా పొడవాటి భారీ సంపు నిర్మించారు.

 అత్యాధునిక సౌకర్యాలో నిర్మించిన ఈ ఆర్​యూబీని చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. యూటూబర్లు, రీల్స్​ క్రియేటర్లు సైతం ఇక్కడ వీడియోలు తీస్తూ సందడి చేస్తున్నారు. గోవా టన్నెల్​ జర్నీని తలపించేలా ఈ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.