కబ్జాకోరుల్లో సగానికి పైగా లీడర్లే.. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్లోనే 90 శాతం కబ్జాలు

కబ్జాకోరుల్లో సగానికి పైగా లీడర్లే.. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్లోనే 90 శాతం కబ్జాలు
  • కబ్జాకోరుల్లో సగానికిపైగా లీడర్లే.. 
  • బీఆర్ఎస్ హయాంలో అన్యాక్రాంతమైన సర్కారు భూములపై నివేదిక
  • ఇంటెలిజెన్స్, రెవెన్యూ శాఖల సంయుక్త విచారణ 
  • సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే 90% కబ్జాలు 
  • భూదాన్, సీలింగ్, అసైన్డ్, దేవుడి మాన్యాలనూ వదల్లే
  • కొందరు అధికార పార్టీలో చేరి సాయం కోసం విజ్ఞప్తులు
  • ఆధారాలతో సహా సీఎంకు చేరిన ‘గులాబీ’ కబ్జాల చిట్టా

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసినవారిలో సగానికి పైగా రాజకీయ నేతలే ఉన్నారని ఇంటెలిజెన్స్, రెవెన్యూ శాఖల సంయుక్త విచారణలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూకబ్జాల్లో 90 శాతం సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నాయని గుర్తించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఫీల్డ్ ఎంక్వైరీ పూర్తి చేసిన అధికారులు ఈ మేరకు సీఎంకు సమగ్ర నివేదిక అందజేశారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్కారు భూములను కొల్లగొట్టారని, కొన్నిచోట్ల సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేశారని, ఇందుకు సంబంధించిన సూత్రధారులు, పాత్రధారుల వివరాలను ఆధారాలతో సహా నివేదికలో పొందుపరిచారు. కొందరు నేతలు అధికార పార్టీలో చేరి, తమ భూముల విషయంలో సాయం చేయాలని సీఎంకు, రెవెన్యూ మంత్రికి విజ్ఞప్తులు పెట్టుకున్నారని, ఆ భూవివాదాల్లో ప్రభుత్వం ఇప్పటికే కోర్టుల్లో ప్రతివాదిగా ఉందని అధికారులు వెల్లడించారు. 

నివేదిక ప్రకారం, 2023 డిసెంబర్‌‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 3 వేల ఎకరాలకు పైగా భూములను కబ్జా చెర నుంచి విడిపించారు. జీవో 58, 59 కింద వందల ఎకరాల విలువైన భూములు అక్రమంగా రెగ్యులరైజ్ కాకుండా అడ్డుకున్నారు. కబ్జాల చిట్టా ఆధారాలతో సహా సీఎం దగ్గరికి చేరడంతో బాధ్యులపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది హాట్ టాపిక్ గా మారింది. 

పకడ్బందీగా కబ్జాలు
తప్పుడు డాక్యుమెంట్లు, ఫోర్జరీ సర్టిఫికెట్లతో సర్కారు భూములను తమ పేర్లతో, బినామీలు, అనుచరుల పేర్లతో ఆక్రమించుకున్నారని నివేదిక పేర్కొంది. ఎవరైనా నిలదీసినా, అధికారులు చర్యలకు సిద్ధమైనా, వెంటనే తప్పుడు పత్రాలతో కోర్టుల్లో కేసులు వేసి వ్యవహారాన్ని న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టేశారని వివరించింది. ఈ వ్యవహారంలో కొందరు బడా వ్యాపారులు ముందుండగా, తెరవెనుక రాజకీయ పెద్దలు చక్రం తిప్పారని అధికారులు నివేదికలో వెల్లడించారు.

కొండలు, గుట్టలు, వాగులనూ వదల్లే
సాగుకు ఏమాత్రం పనికిరాని కొండలు, గుట్టలు, బండరాళ్లు, వాగులు, వంకలు, రోడ్ల కోసం వదిలిన భూములు, బంజరు, చల్క భూములను సైతం ఆక్రమించి రిజిస్ట్రేషన్లు చేశారని నివేదిక తెలిపింది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను టార్గెట్ చేసి సర్వే నంబర్లు మార్చడం, సరిహద్దులు చెరిపేశారని తేల్చింది. నిరుపేదల జీవనోపాధి కోసం ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను, పల్లెల్లో పశువుల మేత కోసం కేటాయించిన మేత భూములను కూడా నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై స్వాహా చేశారని పేర్కొంది.

భూదాన్, సీలింగ్ సర్‌‌ప్లస్ భూములు, ఇనాం భూములు, విలువైన ఎనిమీ ప్రాపర్టీలు, కొన్నిచోట్ల అటవీ భూములు, దేవుడి మాన్యాలనూ తప్పుడు పత్రాలతో చేజిక్కించుకున్నారని గుర్తించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటడంతో అందుబాటులో ఉన్న ప్రతి ప్రభుత్వ భూమిని పక్కా ప్రణాళికతో  చేజిక్కించుకున్నారని స్పష్టం చేసింది.
 
మియాపూర్ పరిధిలోని హఫీజ్ పెట్ సరిహద్దులో సర్వే నంబర్లు 44, 77, 78, 79, 80 లో దాదాపు 484 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమి దశాబ్దాలుగా ఆక్రమణల్లో ఉంది. నిజాం కాలం నాటి 'పైగా' భూమి అని ప్రైవేట్ వ్యక్తులు క్లెయిమ్ చేస్తూ, నకిలీ జీపీఏలు, ఫోర్జరీ రెవెన్యూ రికార్డులతో రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చారు. ఇందులో భారీ ఆపార్టుమెంట్లు కట్టారు. కేవలం 53 ఎకరాలు ఖాళీ స్థలం ఉంటే అందులో ఒక 17 ఎకరాల ల్యాండ్ క్లియర్ అయింది. మరో  36 ఎకరాల ల్యాండ్ కోసం ప్రభుత్వం కోర్టు లో కోట్లాడుతోంది.

నివేదికలో కొన్ని కేసులు

అమీన్‌‌పూర్: వందల ఎకరాల ప్రభుత్వ, పోరంబోకు భూములు, గుట్టలు, వాగులు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను రాజకీయ నేతలు కొల్లగొట్టారు. నకిలీ పంచాయతీ అనుమతులు, ఫ్యాబ్రికేటెడ్ లేఅవుట్లు సృష్టించి ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేశారు. సర్వే నంబర్లు 999, 343లలో 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని బినామీలతో ప్లాట్లుగా మార్చారు. చెరువుల బఫర్ జోన్లలో స్థానిక మున్సిపల్ ప్రజాప్రతినిధి కట్టిన భవనాలు, వాణిజ్య సముదాయాలు రికార్డుల్లో బయటపడ్డాయి. హైడ్రా, రెవెన్యూ శాఖల 
సంయుక్త ఆపరేషన్‌‌లో 800 ఎకరాలకు పైగా ఆక్రమిత భూములను గుర్తించి, అక్రమ నిర్మాణాలను కూల్చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఖాజాగూడ (శేరిలింగంపల్లి): ఐటీ కారిడార్‌‌కు అతి దగ్గర్లో సర్వే నంబర్ 27/2లో ఉన్న ‘సర్కారీ పోరంబోకు’ భూమికి పాత తేదీలతో రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో ప్రైవేట్ భూమిగా చూపించి రిజిస్ట్రేషన్లు చేశారు. కొందరు రాజకీయ నేతలు వెనుక ఉండి చక్రం తిప్పారు. రెవెన్యూ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణ వేగవంతం చేసి, అక్రమ డిజిటల్ ఎంట్రీలను రద్దు చేస్తూ కోర్టుల్లో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేసింది. త్వరలో అనుకూల తీర్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఇబ్రహీంపట్నం: సర్వే నంబర్లు 162, 163, 165లలో సుమారు 450 ఎకరాల భూదాన్ భూమి ఉంది. పేదల కోసం దానం చేసిన ఈ భూములను స్థానిక రాజకీయ నేతలు, బడా రియల్టర్లు కుమ్మక్కై స్వాహా చేశారు. నకిలీ వారసులను సృష్టించి భూదాన్ బోర్డు నుంచి ఎన్ఓసీలు పొంది, లగ్జరీ విల్లాలు, కమర్షియల్ వెంచర్లుగా మార్చేశారు. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ భూదాన్ భూమిగానే ఉండటంతో ప్రభుత్వం బాధ్యులపై విచారణ జరుపుతోంది.

తుర్కయాంజాల్ (అబ్దుల్లాపూర్‌‌మెట్): సర్వే నంబర్ 212లో రూ.50 కోట్ల విలువైన 5 ఎకరాలకు పైగా ‘సర్కారీ గైరాన్’ భూమి ఉంది. నిరుపేదల చిన్న ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు తెచ్చిన జీవో 58, 59 కింద, అక్కడ ఎలాంటి ఇండ్లు లేకున్నా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ భూమిని అక్రమంగా రెగ్యులరైజ్ చేయించుకుంది. ఆ తర్వాత అక్కడ భారీ అపార్ట్‌‌మెంట్లు, షాపింగ్ మాల్స్ కట్టింది. ఆర్డీవో, తహసీల్దార్ల విచారణలో నిబంధనల ఉల్లంఘన బయటపడడంతో ఆ క్రమబద్ధీకరణను రద్దు చేయాలని కలెక్టర్‌‌కు నివేదిక ఇచ్చారు.

మరిన్ని వార్తలు