ఉత్తరాఖండ్‌‌‌‌ చార్ ధామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలు బంద్

ఉత్తరాఖండ్‌‌‌‌ చార్ ధామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలు బంద్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌‌‌లో చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ సేవల్లో ప్రతిష్టంభన నెలకొంది. ప్రతి విమానంలోనూ ఇద్దరు పైలట్లు (కో-పైలట్) ఉండాలనే కొత్త నిబంధనను వ్యతిరేకిస్తూ ఆపరేటర్లు సోమవారం హెలికాప్టర్ సర్వీసులను నిలిపివేశారు. దీంతో పలువురు భక్తులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. గతంలో జోషిమఠ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంతో.. భద్రతా చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ టూ- పైలట్ నిబంధనను తెచ్చింది. 

అయితే, ఈ నిబంధన వల్ల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని, దీనిని భరించడం అసాధ్యమని ఆపరేటర్లు వాదిస్తున్నారు. ఈ వివాదంపై ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ (యూకాడా) అధికారులతో ఆపరేటర్లు జరిపిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమస్య పరిష్కారానికి నవంబర్ 4న మరోసారి భేటీ కావాలని అధికారులు నిర్ణయించారు.