చొరబాటుదారులకు ఓటు హక్కు ఇవ్వం.. ఈ దేశ పౌరులే ఇక్కడ ఓటెయ్యాలె: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

చొరబాటుదారులకు ఓటు హక్కు ఇవ్వం.. ఈ దేశ పౌరులే ఇక్కడ ఓటెయ్యాలె: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
  • కాంగ్రెస్ చేసింది ఓటు బచావో కాదు.. బంగ్లా చొరబాటుదారుల పరిరక్షణ ర్యాలీ
  • ఎన్ని ర్యాలీలు చేసినా బంగ్లాదేశ్​ వాళ్లని అడుగు పెట్టనివ్వం
  • 13 కోట్ల ఓట్లు పోయాయనడం పచ్చి అబద్ధం
  • డబుల్, చనిపోయినవారి ఓట్లు తీస్తే తప్పేంటి ?
  • 2014, 2019లలో మోదీ గెలిచినప్పుడు ‘సర్’ లేదు కదా
  • కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం.. ఓడితే ఈవీఎంల తప్పా ?
  • తెలంగాణలో అవినీతిని అరికట్టడం బీజేపీతోనే సాధ్యం
  • 2029 నాటికి దేశాన్ని ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’గా మారుస్తాం
  • మహాపాదయాత్ర సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

హైదరాబాద్, వెలుగు: ఈ దేశంలో భారత పౌరులు మాత్రమే ఓటు వేయాలని, అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది ఓటు బచావో ర్యాలీ కాదని, అది ముమ్మాటికీ ‘బంగ్లాదేశీ చొరబాటుదారుల పరిరక్షణ ర్యాలీ’ అని విమర్శించారు.

సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి– అరాచకత్వాన్ని తరిమికొట్టండి’ అనే నినాదంతో బీజేపీ మహా పాదయాత్ర నిర్వహించింది. బషీర్​బాగ్​లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్ ఎక్స్ రోడ్స్ వరకు పాదయాత్ర కొనసాగించింది. ఈ సందర్భంగా చీఫ్ గెస్టుగా హాజరైన అమిత్ షా మాట్లాడారు.

సర్దార్ వల్లభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భాయ్ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆనాడు నిజాంను తలవంచేలా చేసి ఉండకపోతే ప్రస్తుతం హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది కాదన్నారు. సర్ ప్రక్రియను అడ్డుకుని బంగ్లాదేశీ చొరబాటుదారులను కాపాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్ని ర్యాలీలు చేసుకున్నా, ఎంత బలం ప్రయోగించినా సరే ఒక్క చొరబాటుదారుడిని కూడా భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టనివ్వబోమని అమిత్​షా హెచ్చరించారు.

దేశంలో ఉన్న ప్రతీ ఒక్క బంగ్లాదేశీ చొరబాటుదారుడిని ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే తరిమికొట్టేంత వరకు బీజేపీ విశ్రమించబోదని, ఈ దేశ పౌరులు మాత్రమే ఇక్కడ ఓటు వేయాలన్నదే తమ దృఢ నిశ్చయమని తేల్చి చెప్పారు.

డబుల్​ ఓట్లు ఉంటే తీయొద్దా..
దేశంలో 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని అమిత్ షా అన్నారు. ఆ13 కోట్ల ఓట్లలో 6.25 కోట్ల ఓట్లు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిపోయిన వారివని, వేరే ప్రాంతానికి నివాసం మార్చిన వారికి రెండు చోట్లా ఓటు హక్కు ఉండకూడదు కాబట్టే తీసేశామని చెప్పారు.  

దాదాపు 3 కోట్ల మంది చనిపోయిన వ్యక్తుల పేర్లని, ఆ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించకపోతే కాంగ్రెస్ పార్టీ బోగస్ ఓట్లు వేయించుకుని ఎన్నికలను దొంగిలించాలని చూస్తోందని ఆరోపించారు. మరో కోటి ఓట్లు ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న డబుల్ ఎంట్రీలని స్పష్టం చేశారు. డబుల్ ఓట్లు, చనిపోయినవారి ఓట్లను తొలగిస్తే తప్పేంటని  ప్రశ్నించారు. అసలు ఉనికిలోనే లేని ఆ 3 కోట్ల దొంగ ఓటర్లు, బంగ్లాదేశీ చొరబాటుదారుల పేర్లు తొలగిపోతుండటం చూసే రాహుల్ కు కడుపులో నొప్పి మొదలైందని ఎద్దేవా చేశారు.

ఈవీఎంలు, సర్​పై చర్చకు సిద్దం..

ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన మాక్ పార్లమెంట్‌‌‌‌పై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అసలైన పార్లమెంట్‌‌‌‌లో రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని, కనీసం ఆ నకిలీ పార్లమెంట్‌‌‌‌లోనైనా ప్రతిపక్ష నేతగా కాకుండా ఒక్కసారి ప్రధానిగా కూర్చుంటే సోనియా గాంధీ మనసుకు కాస్త శాంతి దక్కుతుందని ఎద్దేవా చేశారు. మూడు, నాలుగు నెలలకోసారి రాహుల్ గాంధీ విదేశాలకు పోతారనీ, ప్రజా సమస్యలపై పోరాడకుండా ఎన్నికల్లో గెలవలేరన్నారు. ఈవీఎంలు, సర్, చొరబాటుదారుల అంశాలపై చర్చకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పిలవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దమ్ముంటే రాహుల్ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి రేవంత్ సర్కార్ ఒక ఏటీఎంలా మార్చేసిందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వసూలవుతున్న ‘ఆర్ఆర్ ట్యాక్స్’ అంటే కేవలం రేవంత్ రెడ్డి ట్యాక్స్ మాత్రమే కాదని, అది రేవంత్ రెడ్డి ద్వారా వసూలు చేస్తున్న ‘రాహుల్ ట్యాక్స్’ అని ఆరోపించారు.  తెలంగాణలో అవినీతిని సమూలంగా అరికట్టడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ‘కటాకట్ కటాకట్’ అంటూ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నేడు ‘సఫాచట్’(తుడిచిపెట్టుకపోవడం) అయిపోయాయని ఎద్దేవా చేశారు.

డ్రగ్స్ ఫ్రీ ఇండియాగా మారుస్తం.. 
 పరిపాలనలో మోదీ సర్కారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని అమిత్ షా వివరించారు. జమ్మూకశ్మీర్‌‌‌‌లో ఆర్టికల్ 370 రద్దు చేశామని, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామని, ముస్లిం మహిళలకు రక్షణగా ట్రిపుల్ తలాక్ రద్దు చేశామని గుర్తు చేశారు. 

సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్‌‌‌‌తో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని అంతం చేశామన్నారు. 2029 డిసెంబర్ 31 నాటికి దేశాన్ని సంపూర్ణ ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’గా మారుస్తామని హామీ ఇచ్చారు.

దేశంలో 81 కోట్ల మందికి ఉచిత రేషన్, 50 కోట్ల మందికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, 16 కోట్ల ఇళ్లకు నల్లా నీరు, 13 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సాయం, 12 కోట్ల మరుగుదొడ్లు, 10 కోట్ల ఉజ్వల గ్యాస్ సిలిండర్లు అందించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని తెలిపారు. కానీ కాంగ్రెస్ పదేళ్ల యూపీఏ పాలనలో ఏకంగా రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని, అదే ప్రధాని మోదీ దశాబ్ద పాలనలో ఆయనపై పైసా అవినీతి మచ్చ కూడా లేదని అమిత్ షా చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వెంటిలేటర్‌‌‌‌పై కొట్టుమిట్టాడుతోందని, మోదీతో మారథాన్‌‌‌‌లో పోటీపడటం అటుంచి.. తెలంగాణ బీజేపీ యువమోర్చా నేతలు కూడా రాహుల్ గాంధీని ఎన్నికల్లో సులభంగా ఓడించగలడని చెప్పారు. తమిళనాడులో 64 ఏళ్లుగా, బెంగాల్‌‌‌‌లో 54 ఏళ్లుగా, గుజరాత్, యూపీలలో 41 ఏళ్లుగా, ఒడిశాలో 26 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయిందని, దేశవ్యాప్తంగా ఆ పార్టీ పతనం ఖాయమైందన్నారు.

ఇంటింటికీ ‘సర్’ వాస్తవాలు.. 
సర్ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఎన్డీయే కూటమి వాస్తవాలతో కూడిన సమాచారాన్ని ప్రచురించిందని అమిత్ షా తెలిపారు. బీజేపీ కార్యకర్తలు ఆ కరపత్రాలను తెలంగాణలోని ప్రతీ ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ అబద్ధాలను బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మూడింట రెండొంతుల మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సభలో కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, ఎంపీలు రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, నగేశ్, బీజేఎల్​పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేశ్ రెడ్డి, సూర్యనారాయణగుప్త, బీజేపీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ఎన్. మధుకర్, చింతల రాంచంద్రారెడ్డి, గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, అశోక్, ఎన్​వీ సుభాష్, కార్తీకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 
తెలంగాణలోనూ గెలుస్తం..
ఈవీఎంలపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో ఉందని అమిత్ షా అన్నారు. 2014, 2019లలో నరేంద్రమోదీ సర్కారు గెలిచినప్పుడు ఈ ‘సర్’ ప్రక్రియ లేదని గుర్తుచేశారు. 2024 ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హర్యానా, బీహార్‌‌‌‌లలో బీజేపీ భారీ మెజారిటీ సాధించిందని, 30 ఏళ్ల తర్వాత ఢిల్లీని గెల్చుకున్నామని, అసోంలో మూడోసారి గెలిచి బెంగాల్‌‌‌‌లో మమతా బెనర్జీని కట్టడి చేశామని చెప్పారు. మరి ఇవన్నీ ‘సర్’ తోనే జరిగాయా..? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు, ఓడిపోతే ఈవీఎంల తప్పా అని నిలదీశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగితే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా సీఎం అయ్యారో చెప్పాలని సవాల్ విసిరారు. కేరళ, హిమాచల్, తమిళనాడులలో కాంగ్రెస్ కూటమి ఎలా గెలిచిందో సమాధానం చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌‌‌‌ విష ప్రచారాలను తిప్పికొట్టాలి: బీజేపీ స్టేట్​ చీఫ్​

కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగబద్ధ సంస్థలతో పాటు ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టిన సర్ ప్రక్రియపై కాంగ్రెస్‌‌‌‌, ఇండి కూటమి చేస్తున్న విషపూరిత అసత్య ప్రచారాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌‌‌ రాంచందర్‌‌‌‌ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  మహా పాదయాత్రను విజయవంతం చేసిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్‌‌‌‌, ఇండి కూటమి పన్నుతున్న కుట్రలను, పచ్చి అబద్ధాలను బట్టబయలు చేసేందుకే సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌ షా స్వయంగా హైదరాబాద్‌‌‌‌ గడ్డపైకి వచ్చి ఈ పాదయాత్రలో మనతో కలిసి అడుగులు వేశారని గుర్తు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూనే, తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని రాంచందర్‌‌‌‌ రావు స్పష్టం చేశారు.