నల్గొండ: సూర్యాపేటలో ఏసీబీ దాడులు చేసింది. GHMC అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరిరావుకు చెందిన సూర్యాపేట నివాసంతో సహా అతని బంధువుల ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది.
తెలంగాణ ఏర్పడ్డాక సామాన్యుడి బతుకు పెద్దగా మారకపోయినా.. కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే గత 12 ఏండ్లలో వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారు. ఇటీవల ఏసీబీకి చిక్కిన వారిలో 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టిన వారు 25 మంది ఉన్నారు.
కాళేశ్వరం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్ శాఖల చుట్టూ తిరిగిన ఈ అవినీతి చక్రంలో నలుగురు ఇంజినీర్ల ఆస్తులే రూ.1,000 కోట్లు ఉండడం గమనార్హం. లక్షల్లో జీతాలు ఉన్నా.. రూ.500 మొదలు ఎంత దొరికితే అంత దోచేస్తున్నారు. కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కామ్, భూదాన్ భూముల అక్రమ బదలాయింపులు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ సహా పలు కీలక కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా రంగంలోకి దిగింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో పట్టుబడుతున్న అధికారులు తాము అవినీతి చేయలేదనే వాదనను తెరపైకి తెస్తున్నారు. భూములు, ఇతర స్థిరాస్తులు కొన్నామని, వాటి మార్కెట్ విలువ పెరిగిపోయిందని, అది చట్టబద్ధమైన మార్గమేనని అంటున్నారు. 2014 తర్వాత సమకూరిన ఆస్తులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది హాట్ టాపిక్‌గా మారింది. కొందరైతే బంధువులు, స్నేహితుల పేరిట ఆస్తులు కొనిపడేశారు. ఏసీబీ అటాక్స్కు దిగడంతో అందరి ఇండ్లలోనూ టెన్షన్ నెలకొంది.
