కాళేశ్వరానికి లక్ష కోట్లు.. మునుగోడుకు నిధుల కరువా? : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

కాళేశ్వరానికి లక్ష కోట్లు.. మునుగోడుకు నిధుల కరువా? : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

‎చండూరు, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన పాలకులు.. ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడుతున్న మునుగోడుకు నిధులు ఎందుకు కేటాయించలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలు.. ప్రజలు, రైతులకు ఉపయోగపడే చెరువుల అభివృద్ధిని ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. సోమవారం మునుగోడు క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్‌నినో ప్రభావం, కరువు నివారణ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నా.. అందుకు తగిన నిధులు రావడం లేదన్నారు. గత ప్రభుత్వం రిజర్వాయర్ల పేరుతో వేల కోట్లు ఖర్చు చేసినా నీటి తరలింపుపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి ఏదుల రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వర్షాకాలంలో ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేలా చెరువులను అభివృద్ధి చేయాలని, కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ‘‘నేను మంత్రిని కాకపోవచ్చు.. ముఖ్యమంత్రిని కాకపోవచ్చు.. కానీ క్యారెక్టర్‌, క్రెడిబిలిటీ, కెపాసిటీలో వాళ్లకంటే ఎక్కువే’’ అని వ్యాఖ్యానించారు. ఎల్‌నినో ప్రభావంతో పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని కలెక్టర్‌కు సూచించారు.