- తర్వాత ఎటు వెళ్లారో తెలియట్లే
- బోటు, డ్రోన్లతో గాలింపు
- సోమవారమంతా గాలించినా దొరకలే..
ఎల్బీనగర్, వెలుగు : నాగోల్ పరిధిలో అన్నదమ్ములైన ఇద్దరు చిన్నారులు ఇంట్లో నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లి మళ్లీ రాలేదు. సీసీ కెమెరాల్లో పరిశీలించగా, బండ్లగూడ చెరువు వైపు వెళ్లినట్టు కనిపించడం..ఆ తర్వాత ఎటు వెళ్లారో తెలియకపోవడంతో చెరువులో బోటుతో గాలిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల డ్రోన్లతో వెతుకుతున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు సెర్చ్ఆపరేషన్ కొనసాగించినా ఆచూకీ దొరకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సాయిరాం నగర్ కాలనీ, రోడ్ నంబర్ 3కు చెందిన మొగిలి శిరీష, ఈమె భర్త రవికి వరుణ్ తేజ్ (8), మహేష్ (6) కొడుకులు. నాగోల్ ప్రభుత్వ స్కూల్లో వరుణ్ తేజ్ నాలుగో తరగతి, మహేష్ రెండో తరగతి చదువుతున్నారు. ఆదివారం ఉదయం తల్లి పనికి వెళ్లి రాత్రి 9.30 గంటలకు ఇంటికి తిరిగి రాగా పిల్లలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లి బయటకు వెళ్లగానే...
పోలీసులు సుమారు 80 సీసీ కెమెరాలను పరిశీలించగా, తల్లి ఇంటి నుంచి వెళ్లాక ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లినట్లు గుర్తించారు. మార్గమధ్యలో ఓ షాపు వద్ద ఏదో కొనుక్కుని తిన్నారని, చుట్టుపక్కల కాలనీల్లో తిరుగుతూ చివరకు బండ్లగూడ చెరువు సమీపంలోని కాత్యాయని గార్డెన్ వద్దకు చేరుకున్నట్లు గుర్తించారు. అయితే అక్కడి నుంచి చిన్నారులు ఎటువైపు వెళ్లారన్నది తెలియలేదు. గార్డెన్ పక్కనే ఉన్న చెరువులోకి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటారనే అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
హైడ్రా డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో బోట్ల ద్వారా చెరువులో గాలిస్తున్నారు. మరోవైపు డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. చిన్నారులు ఎక్కడైనా కనిపిస్తే నాగోల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని నాగోల్ సీఐ మక్బూల్ జానీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బతుకుదెరువు కోసం నగరానికి ఒంగోలు నుంచి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నామని, తమ పిల్లలు లేకపోతే తాము చచ్చిపోతామని, వెతికిపెట్టాలని వేడుకుంటున్నారు.
