వాషింగ్టన్: అంతరిక్షంలో కలకలం సృష్టిస్తున్న చైనా రహస్య రోబోటిక్ స్పేస్ ప్లేన్ ఫొటోను అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. గత ఆరేండ్లుగా భూకక్ష్యలో చక్కర్లు కొడుతున్న ఈ 'షెన్లాంగ్' (డివైన్ డ్రాగన్) విమానంపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భూ కక్ష్యలోకి ప్రవేశించి అక్కడ కొన్ని గుర్తుతెలియని వస్తువులను జారవిడుస్తున్నట్లు గతంలో వచ్చిన నివేదికలతో ఈ స్పేస్ ప్లేన్ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దీంతో పలు ప్రైవేట్ సంస్థలు, పరిశోధకులు గ్రౌండ్- బేస్డ్ రాడార్ల సాయంతో దీని కదలికలపై నిరంతరం కన్నేశారు.
స్పేస్ డాట్ కామ్ వివరాల ప్రకారం..
ఈ ఫొటోను 2024లోనే మ్యాక్సార్ టెక్నాలజీస్ (ప్రస్తుతం వాంటార్)కు చెందిన శాటిలైట్ 90 కిలోమీటర్ల దూరం నుంచి బంధించింది. అమెరికా రక్షణ నిఘా సంస్థ (డీఐఏ) విడుదల చేసిన తాజా ముప్పు అంచనా నివేదికలో ఈ ఫొటోను పొందుపరిచారు. అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకెళ్లి, అక్కడ వివిధ వస్తువులను అమర్చడం, పరీక్షించడం, ఆ తర్వాత తిరిగి భూమిపైకి సురక్షితంగా రాగల సత్తా ఈ స్పేస్ ప్లేన్కు ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. తాజాగా వెలుగు చూసిన ఫొటోలో షెన్లాంగ్ స్పేస్ ప్లేన్ మరో శాటిలైట్ లేదా కక్ష్యలోని వస్తువుకు అనుసంధానమై (డాక్ అయి) ఉండగా, దాని సోలార్ ప్యానెల్స్ తెరుచుకుని స్పష్టంగా కనిపిస్తున్నాయి. విమానం వెనుక భాగంలో ఉన్న పేలోడ్ డోర్ కూడా తెరిచి ఉన్నట్లు ఈ చిత్రం ద్వారా తెలుస్తోంది.
చైనా ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదు..
అమెరికాకు చెందిన బోయింగ్ నిర్మిత ఎక్స్-37బీ స్పేస్ ప్లేన్‌ను పోలి ఉండే ఈ రీయూజబుల్నౌకను రాకెట్ ద్వారా నింగిలోకి పంపుతారు. ఇది కక్ష్యలో ప్రయాణించిన తర్వాత సాధారణ విమానం మాదిరిగానే నేలమీదకు దిగుతుంది. ప్రస్తుతం ఈ చైనా విమానం తన నాల్గవ అంతరిక్ష మిషన్‌లో భాగంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా ఇది నింగిలోకి దూసుకెళ్లింది. కానీ ఇప్పటివరకు చైనా మాత్రం ఈ ప్లేన్కు సంబంధించిన ఎలాంటి ఫొటోలను విడుదల చేయలేదు. మరోవైపు, ఈ షెన్లాంగ్ నవంబర్ 3న డెన్వర్ నగరంలో, నవంబర్ 5, 6 తేదీల్లో లాస్ ఏంజిల్స్ నగర ఆకాశంలో ఇది ప్రయాణించనుంది. ప్రజలు కళ్లతో సూర్యోదయానికి ముందు స్పష్టంగా చూడవచ్చని నిపుణులు వెల్లడించారు.
