ఢాకా: బంగ్లాదేశ్‌లో రెడీమేడ్ గార్మెంట్స్ కార్మికుల నిరసనలు రెండో రోజు తీవ్రరూపం దాల్చాయి. వేతనాలు పెంచాలని కార్మికులు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో రాజధానితో సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులు పలు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ప్రధాన రహదారులను దిగ్బంధించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అదనపు పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు.
ఢాకాలోని మిర్పూర్ ప్రాంతంతో పాటు అషులియా, గజిపూర్, నారాయణ్‌గంజ్ తదితర ప్రాంతాల్లో ఆందోళనకారులు పోలీసులతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, లాఠీలను ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఆందోళనల కారణంగా ఢాకా, గజిపూర్, మైమెన్‌సింగ్ జిల్లాల్లోని 670 గార్మెంట్ ఫ్యాక్టరీలు మూతపడినట్లు బంగ్లాదేశ్ గార్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
