- డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్
- ఆరు నగరాలు.. 20 వేదికలు.. 27 క్రీడాంశాల్లో పోటీలు
- దేశవ్యాప్తంగా ఏడు వేల మందికి పైగా యువ అథ్లెట్ల రాక
- గ్లోబల్ సమ్మిట్ వనరులను క్రీడలకూ వినియోగించాలి
- హోస్ట్ కోటాలో ‘కర్రసాము’ను చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా తెలంగాణలో క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కోసం చేసే ఏర్పాట్లు శాశ్వతంగా ఉపయోగపడేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను నిర్మించాలని స్పష్టం చేశారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి క్రీడా హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని, తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా ఆ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, సదుపాయాలు కల్పించేందుకు ఖేలో ఇండియాను అవకాశంగా మలుచుకోవాలన్నారు.
20 వేదికలు.. 27 క్రీడాంశాలు
ఖేలో ఇండియా ఏర్పాట్ల కోసం ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సమకూర్చిన వనరులను కూడా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. సమ్మిట్‌లో క్రీడలు, క్రీడాభివృద్ధికి సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడంపైనా దృష్టి పెట్టాలన్నారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా ఏడు వేల మందికి పైగా యువ అథ్లెట్లు, సుమారు రెండు వేల మంది కోచ్‌లు, అధికారులు రానున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఆరు నగరాల్లో 20 వేదికలపై 27 క్రీడాంశాలతో పాటు ఒక డెమో పోటీ నిర్వహించనున్నారు.
తెలంగాణ సంప్రదాయ ఆత్మరక్షణ క్రీడ అయిన కర్రసామును ఆతిథ్య రాష్ట్ర కోటా కింద పోటీల్లో చేర్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను గ్రూప్-1 అధికారులకు అప్పగించాలని, జిల్లాల్లో జరిగే పోటీలకు స్థానిక ట్రైనీ అధికారులు, గ్రూప్-1 అధికారులను నియమించాలని సూచించారు. ఏర్పాట్ల మొదటి దశ నుంచి పోటీలు ముగిసే వరకు వారు బాధ్యత వహించాలన్నారు.
నాణ్యత లోపిస్తే చర్యలు
క్రీడాకారుల ఆహారం, వసతి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రతి వారం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, లోపాలను సహించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసర ఆడంబరాలకు పోకుండా, అందుబాటులో ఉన్న వనరులను మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలని సూచించారు.
తెలంగాణ అథ్లెట్లు సత్తా చాటేలా ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 20 వేదికల్లో చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షలో ప్రదర్శించారు. సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
