మల్లేశ్వరం ఐలాండ్ కు పర్యాటక సొబగులు..జూన్‌‌‌‌‌‌‌‌ నాటికి పూర్తయ్యేలా పనులు వేగవంతం

మల్లేశ్వరం ఐలాండ్ కు  పర్యాటక సొబగులు..జూన్‌‌‌‌‌‌‌‌ నాటికి పూర్తయ్యేలా పనులు వేగవంతం
  • కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ రూపురేఖలు మార్చేలా రూ.57.63 కోట్లతో ప్రాజెక్టు 
  • ద్వీపం అభివృద్ధికి స్వదేశీ దర్శన్​కింద రూ.47.44 కోట్లు కేటాయించిన కేంద్రం
  • రూ.10.19 కోట్లను తన వాటాగా వెచ్చిస్తున్న రాష్ట్ర సర్కారు
  • 30 లగ్జరీ కాటేజీలు, స్పా, వాచ్‌‌‌‌‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌.. 


హైదరాబాద్, వెలుగు: నల్లమల అడవులు.. కృష్ణమ్మ పరవళ్లు.. అలల సవ్వడులు.. ద్వాదశ జ్యోతిర్లింగాలు.. ప్రకృతి అందాలు వెరసి ఆధ్యాత్మికశోభ ఉట్టిపడే నాగర్​కర్నూల్​జిల్లాలోని కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతం త్వరలో టూరిజానికి తలమానికంగా నిలవనుంది. 

ఇక్కడి కృష్ణానది మధ్యలో ఉన్న ఐలాండ్‌‌‌‌‌‌‌‌ కు పర్యాటక సొబగులు అద్దుతున్నారు. కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ రూపురేఖలు మార్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సోమశిల, మల్లేశ్వరం ప్రాంతాల్లో సుమారు రూ.57.63 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. వచ్చే ఏడాది జూన్​నాటికి పనులు పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందించారు. 

మల్లేశ్వరం వద్ద ద్వీపం.. 

పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం వద్ద కృష్ణానదిలో ఉన్న ద్వీపాన్ని టూరిస్ట్​లను ఆకర్షించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ కింద రూ.47.44 కోట్లు కేటాయించింది. రాష్ట్ర సర్కారు తన వాటాగా రూ.10.19 కోట్లు వెచ్చిస్తోంది. 

దీంతో నదీ జలాల మధ్య ప్రకృతి ఒడిలో బస చేయాలనుకునే పర్యాటకుల కోసం ఇక్కడ 30 లగ్జరీ కాటేజీలు, అలసట తీర్చేలా వెల్‌‌‌‌‌‌‌‌నెస్ స్పా ఏరియా, చుట్టూ ఉన్న నల్లమల అడవులను, నదీ ప్రవాహాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించేందుకు ఎత్తయిన వాచ్‌‌‌‌‌‌‌‌టవర్, ల్యాండ్‌‌‌‌‌‌‌‌స్కేప్ గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంతగా త్వరగా ఈ ఐలాండ్‌‌‌‌‌‌‌‌ను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నారు.

‘సోమశిల’ పరిసరాల సుందరీకరణ

కొల్లాపూర్ మండలంలోని సోమశిల లలితా సోమేశ్వర ఆలయంలో ఒకే ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం ఉంది. దీంతో ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. కానీ, వసతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఒకవేళ అక్కడ నైట్ స్టే చేయాలనుకుంటే ఉండలేని పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రూ.6 కోట్లతో ఆలయ పరిసరాలను సుందరీకరిస్తున్నారు. కుటుంబసభ్యులతో వచ్చే భక్తుల కోసం 4 డార్మెటరీ గదులు, ఆధునిక క్యాంటీన్, ప్రసాద విక్రయ కేంద్రం, చిన్నారుల కోసం ప్లే జోన్ ఏర్పాటు చేస్తున్నారు. 

కృష్ణా నదిలో బోటింగ్..

సోమశిల అనగానే నల్లమల కొండల మధ్య కృష్ణానదిలో చేసే బోటింగే గుర్తొస్తుంది. శ్రీశైలం బ్యాక్‌‌‌‌‌‌‌‌వాటర్​లో ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ వీఐపీ పుష్కరఘాట్ వద్ద రూ.1.69 కోట్లతో జెట్టీ, బోటింగ్ పనులను పూర్తిచేశారు.

 వర్షాకాలంలోనూ బోట్లను సురక్షితంగా ఉంచేందుకు, ప్రయాణికులు వేచి ఉండేందుకు వీలుగా రూ.2.50 కోట్లతో అదనంగా బోటింగ్ షెడ్డు నిర్మించనున్నారు. పుష్కరఘాట్ సుందరీకరణ పనులు కూడా వేగవంతం చేశారు. పనులన్నీ పూర్తయితే హోటల్స్, రవాణా, గైడ్లు వంటి విభాగాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.