విలాసవంతమైన నీటి వినియోగాన్ని కట్టడి చేయాలి

విలాసవంతమైన నీటి వినియోగాన్ని కట్టడి చేయాలి

నీటి సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు, నీటి యాజమాన్యాలు సమగ్ర నీటి వినియోగ పద్ధతులను, అత్యవసర పరిస్థితుల్లో వ్యవసాయేతర అనవసరపు వినియోగాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలించి నివారించాలి.

ఎల్‌‌నినో  ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు మారడం, ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి వనరులు తగ్గడం, వర్షపాతం కూడా తగ్గడం, బావుల్లో,  కుంటల్లో,  చెరువుల్లో, నదుల్లో, జలాశయాల్లో నీటిమట్టం పడిపోవడం జరుగుతోంది. తాగునీటి ఎద్దడి పెరగడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. 

తెలంగాణ ప్రభుత్వం కూడా ఎల్‌‌నినో ప్రభావంతో తాగునీటి కొరత వస్తుందని భావించి, రైతులను ఒక పంట సీజన్‌‌ను ముఖ్యంగా యాసంగిలో వరి,  చెరకు మొదలగు నీటిని ఎక్కువగా తీసుకునే సాగును వాయిదా వేయాలని కోరింది.  కానీ నీటి సంక్షోభాన్ని కేవలం వ్యవసాయ రంగంపై మాత్రమే మోపడం న్యాయం కాదు.  నీటిని అన్ని రంగాల్లో సమానంగా, బాధ్యతగా  వినియోగించాలి.

విలాసవంతంగా నీటి వినియోగం 
హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో పరిశ్రమలు, హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్‌‌మెంట్లు, కార్ల వాష్ సెంటర్లు, నిర్మాణ రంగం భారీగా నీటిని వాడుతున్నాయి. తాగునీటితోనే కార్లు కడగడం, ఇళ్లను శుభ్రం చేయడం, అద్దాలు కడగడం, బాత్రూమ్‌‌ల్లో అధికంగా వాడడం వంటి వినియోగం తగ్గించాలి. 

ప్రభుత్వం వ్యవసాయంలో మాత్రమే నియంత్రణ విధిస్తే,  పట్టణ ప్రాంతాల్లో విలాసవంతమైన నీటి వినియోగాన్ని నిర్లక్ష్యం చేయడం  అన్యాయం.  నీటి వనరుల నిర్వహణలో భూగర్భ, ఉపరితల నీటిని కలిపి, వివిధ రంగాల అవసరాలను సమతుల్యంగా పరిగణించాలని నిపుణుల అభిప్రాయం.

పరిశ్రమలు, హోటళ్లు, శీతల పానీయాల కంపెనీలు
సహజ నీటి వనరులను తమ వ్యాపారం కోసం వినియోగించుకొని ఆదాయాన్ని ఆర్జించే ఎన్నో రకరకాల విదేశీ శీతల పానీయాల, దేశీయ కంపెనీలు, మద్యం తయారు చేసే కంపెనీలు, బాటిల్డ్ వాటర్ యూనిట్లు, హోటళ్లు, పెద్ద పరిశ్రమలు, ప్రైవేటు గృహ అపార్ట్‌‌మెంట్ల సముదాయాలు ప్రత్యేక పైప్‌‌లైన్ల ద్వారా లేదా ట్యాంకర్ల ద్వారా పెద్ద మొత్తంలో నీటిని విచ్చలవిడిగా వాడుతున్నాయి.

విదేశీ కంపెనీలు ఈ దేశ నీటివనరులను కొల్లగొట్టి వాడుతున్నాయి. ఇవి లాభదాయక వ్యాపారాలు కాబట్టి, వాటి నీటి వినియోగానికి కఠినమైన కోటాలు, రీసైక్లింగ్ నిబంధనలు, ధరల విధానం విధించాలి. తాగునీటి కొరత ఉన్నప్పుడు విలాస నీటి వినియోగాన్ని, వస్తువుల తయారీకి నీటిని సమృద్ధిగా ఇవ్వడం సమంజసం కాదు.  ప్రభుత్వం తాగునీటికి ప్రాధాన్యమిస్తున్నట్లు  ప్రకటించినా, ఆ సూత్రాన్ని పరిశ్రమల వినియోగంలో కూడా అమలుచేయాలి. అవసరమైతే విపత్కర పరిస్థితుల్లో వీటికి నీటి సరఫరా ఆపివేయాలి.

పట్టణ వినియోగంలో కూడా కట్టుదిట్టం చేయాలి
భారీ అపార్ట్‌‌మెంట్లు, ఐటీ పార్కులు, షాపింగ్ మాల్స్, హోటళ్లలో నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షపు నీటిని సేకరించడం, గ్రే వాటర్‌‌ను రీసైకిల్ చేసి మురుగునీటి పైప్‌‌లైన్లకు, గార్డెనింగ్‌‌కు వాడటం, డ్రిప్ సిస్టమ్స్ వాడటం వంటివి తప్పనిసరి చేయాలి.  ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో కూడా నీటి ఆదా చర్యలను అత్యవసరంగా అమలు చేయాలి.

ప్రైవేటు అక్రమ నీటి సరఫరా, ట్యాంకర్ల వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలి. అక్రమంగా నీటి తరలింపు, వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షణలో ఉంచేందుకు నిఘా విజిలెన్స్ టీమ్‌‌లను నియమించి నీటి అక్రమ నిల్వలు, నీటి అక్రమ తరలింపు వ్యాపారాలను అరికట్టాలి. వర్షపాతం, ఉపరితల, భూగర్భ నీటిని కలిపి ప్రణాళిక వేయాలి.

వ్యవసాయంలో నీటి ఆదా కోసం సాంకేతిక చర్యలు
రైతులు పంట మార్చకుండా కూడా నీటిని ఆదా చేయవచ్చు.  డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలు, మల్చింగ్,  తేమ నిల్వ, ఫార్మ్ పాండ్లు, ఇంటర్‌‌ క్రాపింగ్ వంటి పద్ధతులను  ప్రోత్సహించాలి.  పంట కీలక దశల్లో రక్షణ నీటి పారుదల, స్కిప్-రో నీటి పారుదల, యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ఫోలియర్ స్ప్రేలు వంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ సాంకేతికతలకు సబ్సిడీ,  శిక్షణ ఇస్తే  రైతు పంట మార్చకుండానే నీటిని ఆదా చేయగలడు.

నీటి కేటాయింపులో పారదర్శకత
జలాశయాల్లో ఎంత నీరు ఉంది,  తాగునీటికి,  వ్యవసాయానికి,  పరిశ్రమలకు ఎంతెంత  కేటాయించారు అనే వివరాలు ప్రజలకు తెలియాలి.  ప్రభుత్వం ప్రతి వారం జలాశయాల నీటి మట్టాలు, కేటాయింపులు, వినియోగం ప్రకటిస్తే రైతులు, పౌరులు నమ్మకంతో ఉంటారు. నీటి కేటాయింపులో  పారదర్శకత లేకపోతే  రైతులకు ప్రభుత్వంపై అపనమ్మకం పెరుగుతుంది. జలాశయాల నీటిని సమర్థవంతంగా వాడాలని కేంద్ర నీటి పరిషత్, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

సమగ్ర నీటి వినియోగ విధానం 
నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఒకే రంగంపై భారం మోపడం కాకుండా, అన్ని రంగాలు సమానంగా బాధ్యత వహించాలి. తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి, వ్యవసాయానికి సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులు ప్రోత్సహించాలి, పరిశ్రమలకు రీసైక్లింగ్ నిబంధనలు విధించాలి, విలాసపు నీటి స్నానాలు, వ్యక్తిగత స్విమ్మింగ్ ఫూల్స్, ఓవర్ ఫ్లషింగ్ నీటివినియోగాన్ని తగ్గించాలి.  పట్టణ ప్రాంతాల్లో నీటి ఆదా చర్యలు బలవంతంగా అమలు చేయాలి.

హోటళ్లు, పరిశ్రమలు, శీతల పానీయాల కంపెనీలు, పట్టణ ప్రాంతాలు కూడా నీటి వినియోగంలో తగ్గుదల చూపాలి. అవసరమైతే విపత్కర పరిస్థితుల్లో వీటికి నీటి సరఫరా ఆపివేయాలి. ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ భరోసా, సాంకేతిక మద్దతు, ఆర్థిక రాయితీలు ఇస్తేనే పంట మార్పు విజయవంత మవుతుంది. నీరు ప్రాణాధారం కాబట్టి ప్రతి నీటిబొట్టు ఒడిసి పట్టి,  ఆదాచేసుకోవాలి. నీటిని అన్ని రంగాల్లో సమానంగా, బాధ్యతగా నిర్వహించే విధానం అమలు చేస్తేనే ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా అధిగమించగలం.

రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ [email protected]
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.