ముంబై: భారత స్టాక్ మార్కెట్లలోకి విదేశీ నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసిందని, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై (ఎఫ్‌పీఐల) విధించే లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) పన్నును పూర్తిగా రద్దు చేయాలని కోరిందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. దీంతో పాటు దేశీయ మ్యూచువల్ ఫండ్లలో ఒక పథకం నుంచి మరో పథకానికి మారే (స్విచింగ్) ఇన్వెస్టర్లకు కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని సెబీ సూచించిందని తెలిపింది.
ప్రస్తుతం షేర్లు లేదా ఈక్విటీ ఫండ్లను ఏడాది దాటిన తర్వాత విక్రయిస్తే రూ.1.25 లక్షల లాభం మించిన మొత్తంపై 12.5శాతం ఎల్‌టీసీజీ పన్ను అమలవుతోంది. అయితే, అధిక లావాదేవీల ఖర్చులు, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారత మార్కెట్లలో రాబడులు తగ్గడంతో ఎఫ్‌పీఐలు పెద్దఎత్తున తమ ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు సుమారు రూ.2.95 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నేపథ్యంలో ఎల్‌టీసీజీని ఎత్తివేస్తే విదేశీ ఇన్వెస్టర్ల నికర రాబడులు మరో 2.3 శాతం మెరుగుపడతాయని అంచనా. ఈ ప్రతిపాదనలు అమలైతే విదేశీ పెట్టుబడులు పుంజుకుని రూపాయి విలువ స్థిరపడేందుకు దోహదపడతాయి.
అయితే, ఈ సిఫారసులపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. రాబోయే ఫిబ్రవరి 2027 బడ్జెట్‌లో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేవలం పన్ను రాయితీలే కాకుండా కంపెనీల ఆదాయ వృద్ధి, ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు కూడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెబీ ప్రతిపాదనను పరిశీలిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించారు.
