టాటా అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ లో రూ.2.34 కోట్ల మోసం..మాజీ డిప్యూటీ మేనేజర్‌‌‌‌‌‌‌‌ పై కేసు

టాటా అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌ డ్  సిస్టమ్స్ లిమిటెడ్ లో రూ.2.34 కోట్ల మోసం..మాజీ డిప్యూటీ మేనేజర్‌‌‌‌‌‌‌‌ పై కేసు

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సెజ్ పరిధిలోని టాటా అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్​ఎల్) లో రూ.2.34 కోట్ల భారీ ఆర్థిక మోసం వెలుగుచూసింది. ఈ కంపెనీ మాజీ డిప్యూటీ మేనేజర్-రెగ్యులేటరీ అండ్​లీగల్ కాంప్లియెన్స్‌‌‌‌‌‌‌‌ రామకృష్ణ వేదుల ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. 

2012 నుంచి కంపెనీలో కొనసాగుతున్న ఇతనికి.. ప్రభుత్వ సంస్థలకు రకరకాల చట్టబద్ధమైన ఫీజులు, చెల్లింపులు చేసే బాధ్యతను కంపెనీ అప్పగించి, నిధులను అతని వద్దే ఉంచింది. ఇటీవల సదరు కంపెనీ అంతర్గత విచారణతో పాటు స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించింది. 2012 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు జరిగిన లావాదేవీలను పరిశీలించగా.. రామకృష్ణ చేసిన మోసం బయటపడింది. 

కంపెనీ నుంచి ప్రభుత్వానికి చెల్లించే చట్టబద్ధమైన ఫీజుల నెపంతో అతను మొత్తం రూ.3,00,16,628 డ్రా చేసి, ప్రభుత్వ పోర్టల్స్‌‌‌‌‌‌‌‌ లో కేవలం రూ.66,13,525 చెల్లించాడు. మిగతా రూ.2,34,03,103ను నకిలీ ప్రభుత్వ చలాన్లు, రశీదులను ఫోర్జరీ చేయడం ద్వారా తన సొంత బ్యాంక్ ఖాతాలకు మళ్లించుకున్నాడు. దీనిపై టాటా అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ లీగల్ మేనేజర్ తరుణ్ కొవ్వలి ఇటీవల ఆదిభట్ల పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ సోమవారం తెలిపారు.