ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు..కుప్పంలో కృష్ణా నీళ్లు పారుతుంటే.. వనపర్తికి ఎందుకు రావు

ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు..కుప్పంలో కృష్ణా నీళ్లు పారుతుంటే..  వనపర్తికి ఎందుకు రావు
  • మాజీ మంత్రి తన్నీరు హరీశ్​రావు

హైదరాబాద్/ పెద్దమందడి, వెలుగు: రాష్ట్రంలో  కరువు కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ అసమర్థత వల్ల సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కరువేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ పేర్కొన్నారు.

 వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాలలో సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను సోమవారం మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తదితర నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన రైతు బహిరంగ సభలో హరీశ్ రావు మాట్లాడారు. 

కుప్పంలో కృష్ణా నీళ్లు పారుతుంటే..  వనపర్తికి ఎందుకు రావు?

అల్వాల గ్రామంలోనే 250 ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. శ్రీశైలానికి 221 టీఎంసీలు, జూరాలకు 252 టీఎంసీల నీళ్లు వచ్చినా సకాలంలో మోటార్లు ఆన్ చేయకుండా పంటలను ఎండబెట్టారని ఫైర్​ అయ్యారు.

 ఇక్కడి నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కృష్ణా నీళ్లు పారుతుంటే.. కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనపర్తికి ఎందుకు పారడం లేదని నిలదీశారు. కల్వకుర్తి ద్వారా 50 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా రేవంత్ కేవలం 18 టీఎంసీలే ఎత్తి, మిగతా నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా తన గురువు చంద్రబాబుకు వదిలేశారన్నారు.  కేసీఆర్ హయాంలో కృష్ణా జలాల్లో 41 శాతం వాడుకుంటే, రేవంత్ పాలనలో అది 25 శాతానికే పడిపోయిందని, కళ్లముందు నీళ్లు పారుతున్నా ఎత్తలేని చేతగాని దద్దమ్మ సర్కార్​ అని మండిపడ్డారు. 

 సీఎంకు టాటా చెప్పాల్సిందే.. 

రైతులను ఎలా ఆదుకోవాలో ఆలోచించకుండా సీఎం ఢిల్లీలో కూర్చొని మియాపూర్ భూములు అమ్మి కమిషన్లు కొట్టే ఆరాటంలో ఉన్నారని ఆరోపించారు. ఏపీలో వరదలు వస్తే వెళ్లిన కేంద్ర బృందాలు.. తెలంగాణలో కరువు వస్తే ఎందుకు రాలేదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.  

కల్వకుర్తిలోని 5 మోటార్లను 24 గంటలపాటు నడిపి ఈ ప్రాంతంలోని అన్ని చెరువులను  వెంటనే నింపాలన్నారు. పాలమూరు ప్రాజెక్టులో మట్టి తండును తొలగించి కరివేన, వట్టెం రిజర్వాయర్ల దాకా  నీటిని తరలించాలని డిమాండ్​ చేశారు. 

జూరాల నుంచి మరో 15 రోజుల పాటు నీటిని విడుదల చేసి వానకాలం పంటలను కాపాడాలన్నారు.  ఎండిపోయిన 25 లక్షల ఎకరాలకు నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు యాసంగి  రైతుబంధు, రైతు కూలీలకు రూ.12 వేల భరోసాను తక్షణమే విడుదల  చేయాలని పేర్కొన్నారు.