పంట విక్రయం నుంచి చెల్లింపుల దాకా.. ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురండి

పంట విక్రయం నుంచి చెల్లింపుల దాకా.. ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురండి
  • ధరలు తెలిసేలా మార్కెట్​ యార్డుల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయండి 
  • మార్చి నాటికి కోహెడ మార్కెట్ తొలి దశ పూర్తవ్వాలి: మంత్రి తుమ్మల

 హైదరాబాద్, వెలుగు: రైతు పంట విక్రయ ప్రక్రియను సులభతరం చేసేలా సమగ్ర డిజిటల్ వ్యవస్థను రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబుతో కలిసి మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు మార్కెట్ యార్డులో అడుగుపెట్టినప్పటి నుంచి పంట విక్రయించి, చెల్లింపులు పొందే వరకు ప్రతీ దశను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలన్నారు.

 మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తుల రాక, ధరల వివరాలు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల కార్యకలాపాలు, వేలం వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎంఐఎస్) ఏర్పాటు చేయాలని సూచించారు. యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, గోదాముల నిర్వహణనిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. పంటలకు లభిస్తున్న ధరలు తెలిసేలా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. 

తొలుత అధిక లావాదేవీలు జరిగే మార్కెట్ యార్డుల్లో ఈ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చి, క్రమంగా రాష్ట్రంలోని అన్ని యార్డులకు విస్తరించాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న డిజిటల్ మార్కెట్ విధానాలను అధ్యయనం చేయాలన్నారు. ఐటీ శాఖతో సమన్వయం చేసుకుని వారం రోజుల్లో టెండర్లు పిలవాలన్నారు. కోహెడ మార్కెట్ కు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై అధికారులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సంస్థ ప్రతినిధులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.