‘ఐడీబీఐ ప్రైవేటీకరణ’ను ఆపేయాలి: ఆత్మనిర్భర్ అంటే దేశ ఆస్తులను తెగ నమ్మడమేనా ?

‘ఐడీబీఐ ప్రైవేటీకరణ’ను ఆపేయాలి: ఆత్మనిర్భర్ అంటే  దేశ ఆస్తులను తెగ నమ్మడమేనా ?

మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ (ఐడీబీఐ) ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజా యజమాన్యం, ఆర్థిక సార్వభౌమత్వాన్ని పరిరక్షించాలని జాతీయ కార్మిక సంఘాలతో పాటు బ్యాంకు ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు నిరసనగా నిన్న, నేడు రెండు రోజులపాటు బ్యాంకు కార్యకలాపాలు నిలిపి ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. వారి సమ్మెకు మద్దతుగా కేంద్ర కార్మిక సంఘాలు, బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. 

భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి కోసం  ఆరు దశాబ్దాల క్రితం 1964లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా స్థాపించిన మొదటి ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకు ఐడీబీఐ. నేడు భారతదేశవ్యాప్తంగా దీనికి 2,100కు పైగా బ్రాంచీలు కలిగి, మూడువేలకు పైగా ఏటీఎంలతో భారత ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఈ బ్యాంకులో 19,000 నుంచి 20,000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

ఈ బ్యాంకులో అత్యధిక వాటాలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసి) 49.24% ఉండగా, భారత ప్రభుత్వం 45.48 శాతం వాటాలు కలిగి ఉన్నవి.మంచి లాభాలతో దేశ పారిశ్రామిక అభివృద్ధికి ఇతోధికంగా ఆర్థికంగా సహకారాలందిస్తున్న బ్యాంకును మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. 

ఈ బ్యాంకు గత రెండు, మూడు సంవత్సరాల బ్యాలెన్స్ షీట్లను పరిశీలించితే 2024-–25 ఆర్థిక సంవత్సరం, 2023 –- 24 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికల ప్రకారం బ్యాంకులో లాభాలు,  డిపాజిట్లు పరిశీలించితే 2024-–25 లో నికర లాభం రూ.7,515 కోట్లు. ఇది అంతకుముందు సంవత్సరం కంటే సుమారు 33 శాతం అభివృద్ధి. మొత్తం డిపాజిట్లు 3,10,294 కోట్లు.గత ఏడాదిలో పోల్చితే డిపాజిట్లు 12 శాతం అభివృద్ధి నమోదు అయింది. 2 అక్టోబరు 2026 నాటికి మొత్తం డిపాజిట్లు రూ.3.56 లక్షల కోట్లకు అంటే 17% వృద్ధి చెందాయి.

ఆత్మనిర్భర్ అంటే  దేశ ఆస్తులను తెగ నమ్మడమేనా ? అమ్మకమే లక్ష్యమైపోయింది !
మూడోసారి అధికారంలోనికి వచ్చిన వెంటనే మోదీ స్పష్టమైన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం వ్యాపారం చేయదని, అందుకే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటిని ప్రైవేటు చెస్తామని ప్రధానమంత్రి  ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ప్రైవేటీకరణను పెంచారు.

ప్రభుత్వ రంగంలో నడుస్తున్న పరిశ్రమలను ఒకటి తర్వాత ఒకటి పూర్తిగా నష్టాలతో ఉన్నవాటిని, మంచి లాభాలతో ఉన్నవాటిని చూడకుండా ప్రైవేటీకరణ  చేయడం జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతూ సంస్కరణలను మరింత స్పీడ్‌గా అమలు చేస్తామని స్పష్టంగా ప్రకటించారు.

నాలుగు వ్యూహత్మక రంగాల్లో నామమాత్రం సమైక్యం తప్ప మిగిలిన అన్నిచోట్ల నుంచి ప్రభుత్వం పూర్తిగా తగ్గుతుందని ఆమె స్పష్టం చేశారు.1. అణుశక్తి, అంతరిక్షం, 2.విద్యుత్, పెట్రోలియం, బొగ్గు ఖనిజాలు, 3.రవాణా, టెలి కమ్యూనికేషన్స్,4. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి నాలుగు రంగాలలో కూడా నామమాత్రంగానే ప్రభుత్వం పాత్ర ఉంటుందని తెలిపారు.

ఇవే రంగాలకు చెందిన రెండు బ్యాంకులను, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, హెచ్‌పిడీసీఎల్ ఆయిల్ కంపెనీ అమ్మేస్తామని తెలిపారు. ఆస్తులను అమ్మడం ద్వారా రెండులక్షల కోట్లను సమకూర్చుకుంటామని తెలిపారు.

మేక్ ఇన్ ఇండియా నినాదం ఇస్తూ విదేశీ జపం !
అభివృద్ధి, మార్పు, ఉపాధి కల్పన, అవినీతి రహిత పాలన అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో విదేశీ పెట్టుబడుల కోసం ఎర్రతివాచీలు పరిచి మోకరిల్లుతున్నది. వృద్ధిరేటు పెరుగుతోందని చాటింపు వేస్తున్నారు. ఇది బడా కార్పొరేట్లకు మరింత సంపద చేకూర్చేందుకే దోహదపడుతున్నాయి. అచ్చే దిన్ సంపన్నులకేగానీ, సామాన్య ప్రజానీకానికి ఒరిగిందేమీ లేదు. మోదీ కేబినెట్  ఈ బ్యాంకును విదేశీ పెట్టుబడుదారులకు అమ్మి వేయటానికి నిర్ణయించింది. 

ఇందులో ఉన్న ఎల్ఐసి వాటాలను, కేంద్ర ప్రభుత్వ వాటాలను విదేశీ నియంత్రణలో ఉన్న ప్రైవేటుసంస్థకు బదిలీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని 10 జాతీయ కార్మిక సంఘాలతో కూడిన జాయింట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ (జేపీసీటీయూ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రెండు రోజులు సమ్మెలో 20 వేల ఉద్యోగులు పాల్గొంటున్నారు.

జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పటాన్ని, అమ్మి వేయటాన్ని దాని వెనకాల జరిగిన లావాదేవి పత్రాన్నంటిని బహిరంగ పరచాలని డిమాండ్ చేశాయి. ఐడీబీఐ కేవలం వాణిజ్య బ్యాంకు కాదు, ఇది భారత దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను బలోపేతం చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనలు చారిత్రాత్మక పాత్ర నిర్వర్తిస్తుంది. దీనిని అమ్ముకునే ఆస్తిగా మార్చకూడదు. భారత ప్రభుత్వ అనుసరిస్తున్న  ప్రైవేటీకరణ విధానాలను ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా తిరస్కరిస్తున్నాయి.

ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడం, ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం అవసరం. లక్ష్మీ విలాస్ బ్యాంకును సింగపూర్‌‌కు చెందిన డీబీఎస్ బ్యాంకులో ఇండియాలో విలీనం చేయడం, ఎన్‌బిడిఇలో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడం, సిఎస్‌బీ  బ్యాంకులో 'ఫెయిర్ ఫాక్స్'కు గణనీయమైన యాజమాన్యం ఉండటం వంటివి, విదేశీ లావాదేవీలు పెరుగుతున్న ఉనికిని సూచిస్తున్నాయి.

2026 అక్టోబర్ 29 నాటికి బిజినెస్ వరల్డ్ రిపోర్టు ననుసరించి పరిమితుల ప్రకారం కొత్త వాల్యుయేషన్ ప్రారంభించక ముందే ఐడీబీఐ అమ్మకం ప్రతిపాదన సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని జెపిసిటియు ధ్వజమెత్తింది.

ప్రజా ఆస్తులను అపారదర్శక పద్ధతులలో విక్రయించడం ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆరోపించింది. పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరింది.

ఉజ్జిని రత్నాకర్ రావు, పూర్వపు ప్రధాన కార్యదర్శి, ఏఐటీయుసీ

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ [email protected]
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.