ఏపీకి భారీగా కొరియన్ పెట్టుబడులు.. అనంతపురంలో రూ.1,614 కోట్ల ఇన్వెస్ట్‎మెంట్

ఏపీకి భారీగా కొరియన్ పెట్టుబడులు.. అనంతపురంలో రూ.1,614 కోట్ల ఇన్వెస్ట్‎మెంట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ఇన్వెస్ట్  చేసేందుకు  మూడు సౌత్‌‌‌‌ కొరియా ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థలు ముందుకొచ్చాయి. ఇవి దాదాపు  రూ.1,614 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నాయి.  గ్లోబల్‌‌‌‌ కార్ల తయారీ కంపెనీలు హ్యుందాయ్, కియాలకు విడిభాగాలను సరఫరా చేసే హ్వాషిన్, సియోయాన్, ఇవామెట్ కంపెనీలు అనంతపురం జిల్లాలో తమ కొత్త ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 

ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు సుమారు 1,418 ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మూడు కంపెనీల్లో ఒక సంస్థ రూ.850 కోట్లు, మరొకటి రూ.514 కోట్లు, మూడో సంస్థ రూ.250 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇప్పటికే కియా ప్లాంట్‌‌‌‌తో  ఆటోమొబైల్ హబ్‌‌‌‌గా మారిన అనంతపురం ప్రాధాన్యతను ఈ తాజా పెట్టుబడులు మరింత బలోపేతం చేయనున్నాయి.

ఈ ఏడాది జులైలో ఏపీ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటించి, హ్యుందాయ్– కియా గ్లోబల్ సప్లై చైన్‌‌‌‌తో సంబంధం ఉన్న కంపెనీలతో జరిపిన చర్చలు ఈ పెట్టుబడులకు బాటలు వేశాయి. ఏపీ ఎకనామిక్ డెవలప్‌‌‌‌మెంట్ బోర్డ్ వీటిని వాస్తవ ఒప్పందాలుగా మార్చింది.