జగిత్యాల : డాడీ నేను వస్తా.. ఇంటికి తీస్కపో ..కన్నీరుమున్నీరై దత్తత తండ్రిని చుట్టేసుకున్న మూడేళ్ల బాలుడు

జగిత్యాల : డాడీ నేను వస్తా.. ఇంటికి తీస్కపో ..కన్నీరుమున్నీరై దత్తత తండ్రిని చుట్టేసుకున్న మూడేళ్ల బాలుడు
  • తల్లి చనిపోయిన 5 రోజులకే శిశువును తెచ్చుకునిపెంచుకున్న దంపతులు 
  • చట్టపరంగా దత్తత తీసుకోలేదని మూడేళ్ల తర్వాత శిశువిహార్​కు తరలించిన ఆఫీసర్లు 

కరీంనగర్/ జగిత్యాల టౌన్, వెలుగు: డాడీ నేను వత్తా.. నాకు భయమైతంది. నన్ను ఇంటికి తీసుపో అంటూ మూడేళ్ల చిన్నారి తన దత్తత తండ్రి మెడలు చుట్టేసుకుని కన్నీరుమున్నీరైన సంఘటన జగిత్యాలలో సోమవారం స్థానికులను కలచివేసింది. చట్ట ప్రకారం దత్తత తీసుకోలేదని ఆ బాలుడిని మూడేళ్ల తర్వాత ఆఫీసర్లు శిశు విహార్ కు తరలిస్తే.. పెంచుకున్న కొడుకును తమకు అప్పగించాలని ఆ దంపతులు హైకోర్టు మెట్లు ఎక్కారు. 

బాలుడిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకే అప్పగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం ప్రదర్శించారు. జగిత్యాలకు చెందిన సరిత, శ్రీనివాస్ దంపతులు తమకు పిల్లలు లేకపోవడంతో శిశువును మూడేళ్ల కింద దత్తత తీసుకున్నారు. తల్లి చనిపోయిన ఐదు రోజులకే ఆ శిశువును దత్తత తీసుకుని ఆలనా పాలనా చూసుకుంటున్నారు. 

కన్నబిడ్డకంటే ఎక్కువగా పెంచుకున్నారు. దీంతో పేగుబంధానికి మించిన అనుబంధం ఆ బాబుతో వారికి ఏర్పడింది. ఈ క్రమంలోనే మూడేళ్ల తర్వాత చిన్నారి దత్తత చెల్లదంటూ సీడబ్ల్యూసీ ఆఫీసర్లు ఆ దంపతులకు షాకిచ్చారు. చట్టపరంగా దత్తత తీసుకోలేదంటూ చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు విహార్ కు తరలించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించగా చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని అక్టోబర్ 16న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు సరిత, శ్రీనివాస్ దంపతులు తెలిపారు.

 హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో ఆఫీసర్లు ఆలస్యం చేస్తుండడంతో వారు తమ బిడ్డను చూసేందుకు శిశు విహార్ కు వెళ్లారు. వారిని చూడగానే 'డాడీ నేను వత్తా.. నాకు భయమైతంది అమ్మా' అని గుండెలవిసేలా చిన్నారి రోదించడం అక్కడున్న వారికి కన్నీళ్లు తెప్పించింది. దీంతో బాబును గుండెలకు హత్తుకుని ఆ దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. తమ పెంపుడు బిడ్డను తమకు అప్పగించకుండా సీడబ్ల్యూసీ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేసి కన్నీటిపర్యంతమయ్యారు. 

హైకోర్టు ఉత్తర్వుల మేరకు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తాం : కలెక్టర్ 

దత్తత బాలుడి అంశంపై జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించారు. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు బాలుడిని వెంటనే పెంపుడు తల్లిదండ్రులకు అప్పగిస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

 సీడబ్ల్యూసీ అనుమతి, ఇతర పరిపాలనాపరమైన ప్రక్రియల వల్లే అప్పగింతలో కొంత జాప్యం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఈ ప్రక్రియను త్వరతగతిన పూర్తి చేసి సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయంలోగా బాలుడిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగిస్తామని కలెక్టర్ వెల్లడించారు.