- రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండియా లిస్టులో నంబర్ వన్
- సంపద మొత్తం విలువ రూ.7.45 లక్షల కోట్లు
- ప్రపంచ కుబేరుల్లో 23వ స్థానం
- వెల్లడించిన ఫోర్బ్స్ రిపోర్ట్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యధికంగా సంపదను పెంచుకున్న (బిగ్గెస్ట్ వెల్త్ గెయినర్) బిలియనీర్‌గా రికార్డు సృష్టించారు. రిలయన్స్ షేర్ల విలువ దూసుకెళ్లడంతో ఒక రోజులోనే ఆయన సంపద రూ.50,400 కోట్లకు పైగా పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం సోమవారం అంబానీ సంపద 7.85 శాతం వృద్ధితో రూ.52,920 కోట్లు పెరిగింది.
దీంతో ఆయన మొత్తం సంపద రూ.7,45,920 కోట్లకు చేరుకుంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 23వ స్థానంలో నిలవగా, రూ.6,64,608 కోట్లతో గౌతమ్ అదానీ 26వ స్థానంలో ఉన్నారు. స్పెయిన్ రిటైల్ వ్యాపారి అమన్సియో ఒర్టెగా రూ.14,280 కోట్లు, చైనాకు చెందిన జోంగ్ షాన్షాన్ రూ.12,600 కోట్ల లాభాలతో అంబానీ తర్వాత స్థానాల్లో నిలిచారు.
ఆరేళ్ల గరిష్టానికి రిలయన్స్ షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం ఏకంగా 11.6 శాతం పెరిగాయి. గత 6 ఏళ్లలో ఇదే అత్యధిక పెరుగుదల. నిఫ్టీ– 50 ఇండెక్స్‌లో ఈ షేరు అత్యధిక లాభాలు ఆర్జించింది. ఇటీవల విడుదలైన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో రిలయన్స్ అదరగొట్టింది. అంచనాలను మించిపోయి రూ.25,548 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం.
గత సంవత్సరంతో పోలిస్తే ఇది 40.6 శాతం వృద్ధి. రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారాల్లో మెరుగైన లాభాలు రావడం, టెలికాం వ్యాపారం జియోలో లాభదాయకత పెరగడం సంస్థకు కలిసివచ్చింది. చమురు నుంచి రసాయనాల వరకు విస్తరించిన వ్యాపారం 68 శాతం, జియో ప్లాట్‌ఫామ్స్ లాభాలు 16.6 శాతం మేర దూసుకెళ్లడం మదుపరుల్లో నమ్మకాన్ని పెంచింది.
ఎన్నో రంగాల్లో పెట్టుబడులు
పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఆర్థిక సేవల విభాగాల్లో అంబానీకి పెట్టుబడులు ఉన్నాయి. 1966లో చిన్న టెక్స్టైల్ తయారీ సంస్థగా ప్రారంభమైన రిలయన్స్ రూ.10,50,000 కోట్ల ఆదాయం కలిగిన సంస్థగా ఎదిగింది. జియో ప్లాట్‌ఫామ్స్ రూ.13 లక్షల కోట్ల మార్కెట్ విలువతో దేశంలోనే 2వ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. రాబోయే 7 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.9,24,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
