కాలుష్య భూతం..గాలి కాదు.. విషం..ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం

కాలుష్య భూతం..గాలి కాదు.. విషం..ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం
  • సంగారెడ్డి జిల్లాను కమ్మేస్తున్న  కాలుష్య భూతం
  • 166 స్థాయికి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
  • ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం

మెదక్/ పటాన్ చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లాను కాలుష్య భూతం కమ్మేస్తోంది. పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారుతోంది. స్వచ్ఛమైన గాలి దొరక్క ప్రజలు విషపూరిత వాతావరణంలో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

ఆసియాలో అతిపెద్ద పారిశ్రామిక వాడ ఉన్న ఈ జిల్లాలోని పలు ప్రాంతాలు వాయు కాలుష్యం సమస్యతో సతమతం అవుతున్నాయి. గాలి కాలుష్యం విషయంలో ఏకంగా దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతూ 'మరో ఢిల్లీ'గా మారుతోంది. అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 170గా నమోదైతే, సంగారెడ్డిలో ఏకంగా 166కి చేరుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

జిల్లాలో భారీగా ఉన్న ఫార్మా, బల్క్ డ్రగ్, సాల్వెంట్ రికవరీ, పైరాలసిస్ లాంటి 'రెడ్ కేటగిరీ' పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువులే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా ఎక్యూఐ 50 లోపు ఉంటేనే మంచి వాతావరణంగా పరిగణిస్తారు. 

కానీ సంగారెడ్డిలో ఏకంగా ఎక్యూఐ 166 రికార్డు అయి 'అనారోగ్య వాతావరణం' కేటగిరీలోకి చేరడం గమనార్హం. రానున్న రోజుల్లో కాలుష్యం ఇలాగే పెరిగితే ఇళ్లల్లో కూడా ఎయిర్ ప్యూరి ఫైయర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

అది మాకు లెక్క కాదు...

పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నా.. కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసర్లు మాత్రం అంతా బాగానే ఉందంటూ మాట దాటేస్తున్నారు. ఆన్‌‌‌‌లైన్ వెబ్‌‌‌‌సైట్లలో కనిపిస్తున్న ఎక్యూఐ డేటాను తాము పరిగణనలోకి తీసుకోమని, తమ 5 యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టేషన్లలో (ఐఐటీహెచ్, ఇక్రిశాట్, పాశమైలారం, గడ్డపోతారం, సింఫనీ పార్క్) నమోదయ్యే లెక్కలే ప్రామాణికమని చెబుతున్నారు. ప్రజా ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేస్తున్నామంటున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందనే విమర్శలు ఉన్నాయి.

ఊపిరితిత్తులపై ప్రభావం...

ఎక్యూఐ 150 దాటితే అది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ప్రమాదకరం. ఇలాంటి గాలిని సుదీర్ఘకాలం పీల్చడం హానికరమని డాక్టర్లు చెబుతున్నారు. ఆఫీసర్ల కాగితపు లెక్కలకు స్థానికంగా వెలువడే వాయు కాలుష్యానికి పొంతన కుదరడం లేదు. ఇప్పటికైనా పొగ చిమ్ముతున్న రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో లీకేజీలపై కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు స్పందించకపోతే భవిష్యత్తులో ప్రజారోగ్యంపై మరింత తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. 


రాత్రి పూట ఉక్కిరిబిక్కిరి...

సంగారెడ్డి తో పాటు పటాన్‌‌‌‌‌‌‌‌చెరు, హత్నూర, కంది, అమీన్‌‌‌‌‌‌‌‌పూర్ ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత తారస్థాయికి చేరింది. పగలు కొంత నయంగా ఉన్నా, రాత్రి వేళల్లో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరగడంతో పాటు పరిశ్రమలు వదులుతున్న ఘాటైన రసాయన వాసనలతో ప్రజలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కలుషిత గాలి కారణంగా వృద్ధులు, చిన్న పిల్లలు శ్వాసకోశ సంబంధిత, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. ఆయా సమస్యలతో ఆస్పత్రుల్లో ఏటికేడు పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది.