జూబ్లీహిల్స్: సంబంధానికి అడ్డొస్తున్నాడని ఐదేండ్ల బాలుడి హత్య

జూబ్లీహిల్స్: సంబంధానికి అడ్డొస్తున్నాడని ఐదేండ్ల బాలుడి హత్య
  •     మెడ, పొట్టపై గోళ్లతో గీరిన గాయాలు  
  •     పిల్లవాడి తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి పనే  
  •     గొంతు నులిమి చంపినట్టు అనుమానం

జూబ్లీహిల్స్, వెలుగు : ఐదేండ్ల పిల్లవాడి తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి వారి సంబంధానికి అడ్డొస్తున్నాడని గొంతు నులిమి చంపేశాడు. బోరబండ పోలీసుల కథనం ప్రకారం..ఆజంనగర్ సైట్-3లో ఉండే దుర్గ (23) ప్రిజం హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌లో పని చేస్తోంది. ఆమె భర్త గతంలోనే చనిపోగా, ఐదేండ్ల కొడుకు విజయ్ తో కలిసి ఉంటోంది. ఈమె ఏడాదిన్నర నుంచి నల్లవరపు విద్యాసాగర్ (33) తో సహజీవనం చేస్తోంది. నవంబర్​1న రాత్రి డ్యూటీకి వెళ్లిన దుర్గ 2న ఉదయం ఇంటికి రాగా, విజయ్​విగతజీవిగా కనిపించాడు. 

బాలుడి మెడ, పొట్టపై గోళ్లతో గీరిన గాయాలున్నాయి. విద్యాసాగర్‌‌‌‌ను ఏమైందని ప్రశ్నించగా ఏమీ చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో తన కొడుకును విద్యాసాగరే గొంతు నులిమి చంపి ఉంటాడని ఆమె ఫిర్యాదు చేసింది. గతంలోనూ తన కొడుకును తరచూ కొట్టేవాడని అందులో పేర్కొంది. పరారీలో ఉన్న విద్యాసాగర్ కోసం బోరబండ పోలీసులు గాలిస్తున్నారు.