ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు..దీపావళి నేపథ్యంలో 2 రోజులు సుప్రీంకోర్టు అనుమతి

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు..దీపావళి నేపథ్యంలో 2 రోజులు సుప్రీంకోర్టు అనుమతి
  •     9 నుంచి యథావిధిగా పూర్తి నిషేధం 
  •     పూర్తి నిషేధమే కాలుష్యానికి పరిష్కారమని చెప్పే డేటా లేదు
  •     క్రాకర్స్‌‌‌‌ వ్యాపారులు నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశం

న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు, వ్యాపారులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ నెల 7, 8 తేదీల్లో ఢిల్లీ ఎన్‌‌‌‌సీఆర్ పరిధిలో ప్రజలు సర్టిఫైడ్ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతిచ్చింది. ఈ రెండు రోజుల్లో ప్రజలు కేవలం నిర్దిష్ట సమయాల్లో మాత్రమే టపాసులు కాల్చాలని స్పష్టం చేసింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అలాగే.. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే క్రాకర్స్ కాల్చొచ్చని చెప్పింది. 

ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌‌‌‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, విద్యాసంస్థల చుట్టూ 300 మీటర్ల పరిధిని ‘నో- క్రాకర్ జోన్‌‌‌‌’ గా ప్రకటించింది. పండుగ తర్వాత 9వ తేదీ నుంచి టపాసులపై పూర్తి నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే, ఢిల్లీలో ఏటా పెరిగిపోతున్న వాయు కాలుష్య సమస్యకు టపాసులపై పూర్తి నిషేధమే శాశ్వత పరిష్కారమని కచ్చితంగా చెప్పడానికి తగిన సమాచారం (డేటా) అందుబాటులో లేదని కోర్టు వ్యాఖ్యానించింది. టపాసులపై గతేడాది విధించిన పూర్తి నిషేధం వల్ల గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ)లో మెరుగుదల ఏమీ కనిపించలేదని గుర్తుచేసింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించాలంటూ దాఖలైన పిల్​పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. క్రాకర్స్ వ్యాపారులకు ఈ మార్గదర్శకాలు జారీచేసింది. 

ప్రతి టపాసుల పెట్టెపై క్యూఆర్ కోడ్

చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉన్న తయారీదారులు మాత్రమే ఈ నెల6 వరకు గ్రీన్ క్రాకర్లను తయారు చేసి విక్రయించవచ్చని కోర్టు పేర్కొంది. సాధారణ టపాసులు వీటిలో కలవకుండా ఉండేందుకు గ్రీన్ క్రాకర్లను కచ్చితంగా సీల్ చేసిన పెట్టెల్లోనే విక్రయించాలని ఆదేశించింది. లాడీల తయారీ, అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. 

బేరియం కెమికల్ కలిగిన టపాసులు, లేదా ఎన్ఈఈఆర్ఐ ఆమోదంలేని టపాసులను అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రతి టపాసుల పెట్టెపై ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉండాలని, దానిని స్కాన్ చేస్తే తయారీదారు వివరాలు, లైసెన్స్ నంబర్ స్పష్టంగా కనిపించాలని ఆదేశించింది. గ్రీన్ క్రాకర్ల అమ్మకాలను సులభతరం చేయడానికి వ్యాపారులు రద్దు చేయబడిన లైసెన్స్‌‌‌‌లను ఈ నెల 4 నుంచి 6 వరకు తాత్కాలికంగా పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది.