లూధియానా: డ్రగ్స్‌‌‌‌ కేసులో మహంత్‌‌‌‌ ను ఇరికించేందుకు పోలీసుల స్కెచ్

లూధియానా:  డ్రగ్స్‌‌‌‌ కేసులో మహంత్‌‌‌‌ ను  ఇరికించేందుకు పోలీసుల స్కెచ్
  •     ఇంట్లోని బెడ్ కింద హెరాయిన్ ఉంచేందుకు కుట్ర
  •     సీసీటీవీలో రికార్డ్ కావడంతో ప్లాన్ ఫెయిల్.. పంజాబ్​లో ఘటన

లూధియానా: ఒక హిందూ మత గురువును డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు పంజాబ్ పోలీసులే స్వయంగా బెడ్ మెత్త కింద హెరాయిన్ ఉంచినట్టు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఈ దృశ్యాలు ఇంట్లోని కెమెరాలో రికార్డవడంతో పోలీసుల ప్లాన్ తిరగబడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌గా మారడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలకు దిగారు.ఏఎస్‌‌‌‌ఐ సుఖ్‌‌‌‌దేవ్ సింగ్‌‌‌‌ను సస్పెండ్ చేశారు. అలాగే, డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన మహంత్ కాశ్మీర్ గిరిని కూడా విడుదల చేశారు. 

మహంత్ డ్రైవర్ గుర్జంత్ సింగ్‌‌‌‌ను 7.5 గ్రాముల హెరాయిన్‌‌‌‌తో పట్టుకున్నామని, అతడు ఇచ్చిన సమాచారంతోనే మహంత్ కాశ్మీర్ గిరి ఇంట్లో సోదాలు చేశామని పోలీసులు తెలిపారు. సోదాలో బెడ్ మెత్త కింద 30 గ్రాముల హెరాయిన్ దొరికిందంటూ మాదక ద్రవ్యాల అక్రమ కేసులో మహంత్‌‌‌‌ను అరెస్ట్ చేశారు. అయితే, ఇంట్లోని కెమెరా ఫుటేజ్‌‌‌‌ పోలీసుల ప్లాన్‌‌‌‌ను బయటపెట్టింది. పోలీసుల బృందం రాకముందే సివిల్ దుస్తుల్లో వచ్చిన ఏఎస్ఐ సుఖ్‌‌‌‌దేవ్ సింగ్, బెడ్ కింద ఒక ప్యాకెట్ ఉంచడం అందులో రికార్డయ్యింది. అనంతరం వచ్చిన పోలీసులు ఏఎస్ఐ ప్యాకెట్ దాచిన ప్రదేశం నుంచే హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు డ్రామా ఆడారు.

విచారణకు సిట్ ఏర్పాటు 

ఈ కుట్రపై విచారణకు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. వైరల్ వీడియో ప్రామాణికతను నిర్ధారించడంతో పాటు, ఏఎస్ఐ వెనుక ఉన్న ఇతరుల ప్రమేయంపై సిట్ దృష్టి సారించనుంది. మరోవైపు ఈ ఘటనపై ఆప్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.“ప్రజల ఇండ్ల వద్దకే సేవలు అందిస్తామాన్న ఆప్ ప్రభుత్వం, పౌరులను ఇరికించడానికి పంజాబ్ పోలీసులతో నేరుగా ఇండ్లకే డ్రగ్స్ డెలివరీ చేయిస్తోంది. సీఎం  భగవంత్ మాన్ తెచ్చిన మార్పు ఇదేనా?’’ అని అకాలీదళ్ చీఫ్ సుఖ్‌‌‌‌బీర్ సింగ్ బాదల్ తీవ్రస్థాయిలో విమర్శించారు.