విదేశీ అండతోనే ప్రధాని సీట్లో మోదీ..బీజేపీకి రాహుల్ గాంధీ కౌంటర్

విదేశీ అండతోనే ప్రధాని సీట్లో మోదీ..బీజేపీకి రాహుల్ గాంధీ కౌంటర్
  •     ఎప్పుడైనా, ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు రెడీ అంటూ సవాల్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఆ సీటు దక్కిందే విదేశీ సాయం వల్ల అంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ శక్తుల అండతోనే మోదీ ఆ పదవిలో కొనసాగుతున్నాడని ఆరోపించారు. ఈ అంశంపై తాను ఎక్కడైనా, ఎప్పుడైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమని ప్రధాని మోదీకి రాహుల్ సవాల్ విసిరారు. అబద్ధాలు చెబుతూ దేశ ప్రజలను మభ్య పెట్టడం ఇకనైనా ఆపాలంటూ హితవు పలికారు. 

విదేశీ శక్తులు సాయం తీసుకుని మన దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. నిజానికి విదేశీ అండదండలతోనే మోదీకి ప్రధాని సీటు దక్కిందని, ఇప్పటికీ ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ విదేశీయుల కంట్రోల్ లోనే ఉన్నాయని ఆరోపించారు. ‘మోదీ ఆర్థిక వ్యవస్థ మొత్తం విదేశీయుల నియంత్రణలోనే ఉంది. విదేశాలకు చెందిన సోషల్ మీడియా ఆయనకు అండదండలు అందిస్తోంది’ అంటూ సోమవారం రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ విషయంపై దమ్ముంటే చర్చకు రావాలంటూ మోదీకి సవాల్ విసిరారు.

ఇకనైనా అబద్ధాలు మానుకోండి

‘మిస్టర్ మోదీ.. ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానుకోండి. మీరు ప్రధాని అయ్యిందే ఫారెన్ హెల్ప్ తో, మీరింకా ఆ పదవిలో కొనసాగుతున్నారంటే కారణం విదేశీ సాయమే’ అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ విషయంపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని, మోదీ మాత్రం వచ్చేందుకు ధైర్యం చేయడని ఎద్దేవా చేశారు. తన వద్ద ప్రధానికి సంబంధించిన సున్నితమైన సమాచారం ఉందని, అందుకే ఆయన చర్చకు రావడానికి భయపడతారని రాహుల్ ఆరోపించారు.