నవంబర్ 20 నాటికి స్కిల్ యూనివర్సిటీ రెడీ.. అక్కడే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్: మంత్రి వివేక్ వెంకటస్వామి

నవంబర్ 20 నాటికి  స్కిల్ యూనివర్సిటీ రెడీ.. అక్కడే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • 2 వేల మంది డెలిగేట్లకు అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు
  • 9 సెమినార్ హాళ్లు.. రౌండ్ టేబుల్ సమావేశాలకు 13 గదులు
  • వర్సిటీ భవన నిర్మాణ పనులను పరిశీలించి సమీక్షించిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీ శాశ్వత భవనాల్లోనే డిసెంబర్ 9 నుంచి 11 వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర శక్తి, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. 

ఈ నెల 20 నాటికి అన్ని నిర్మాణ, ఫినిషింగ్ పనులు పూర్తి చేసి యూనివర్సిటీని సిద్ధం చేస్తామని వెల్లడించారు. సోమవారం స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు.

గతేడాది సమ్మిట్ కోసం తాత్కాలిక ఏర్పాట్లకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని, ఈసారి అదనపు వ్యయం లేకుండా శాశ్వత భవనాల్లోనే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు. ఈ మేరకు గత నాలుగు నెలలుగా పనులను వేగవంతం చేశామన్నారు. నవంబర్ 15 నాటికి 90 శాతం నిర్మాణ పనులు పూర్తవుతాయని, డెలిగేట్ల రాకకు ముందే 20వ తేదీ నాటికి అన్ని ఫినిషింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు.

ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నం
నిర్మాణాల్లో నాణ్యత తగ్గకుండా మూడు కాంట్రాక్టింగ్ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ పనులు చేపడుతున్నామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. నిర్మాణ సామగ్రి కొరత లేకుండా, తగినంత మంది కార్మికులను మోహరించి ఎలక్ట్రిఫికేషన్ పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. 

గ్లోబల్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దేశ, విదేశాల నుంచి సుమారు 2 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని, వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సదస్సు కోసం ల్యాబ్-1లో 6, అకాడమిక్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 సెమినార్ హాళ్లు సిద్ధం చేశామని తెలిపారు. పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల రౌండ్ టేబుల్ సమావేశాల కోసం మరో 13 గదులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. 

గతేడాదిని మించి పెట్టుబడులు ఆకర్షిస్తం
గత ఏడాది గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రూ.5.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి వివేక్ గుర్తుచేశారు. ఈసారి అంతకంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 

ఇందుకు పారిశ్రామికాభివృద్ధితో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడం కీలకమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) మారుస్తున్నామని మంత్రి తెలిపారు.

రూ.4 వేల కోట్లతో మరో 54 ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో విద్యార్థులకు స్టైఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో చదువుతో పాటు ఆదాయం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు పొందిన యువత పరిశ్రమల్లో వెంటనే ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రానున్న గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి మైలురాయిగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.