కరీంనగర్, వెలుగు: రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు బీజేపీ ఓట్ చోరీ కుట్రలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభకు మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ హాజరుకాకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.
మంథని నియోజకవర్గంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో తనతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం తప్పయితే.. రాహుల్ సభకు ఎమ్మెల్యేలు రాకపోవడం అంతకన్నా పెద్ద తప్పు ఎందుకు కాదని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్యేల కో న్యాయం, సామాన్య కార్యకర్తలకో న్యాయమా?’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబుకు ఎంపీ వంశీకృష్ణ సోమవారం లేఖ రాశారు.
కాంగ్రెస్ కార్యకర్తల సస్పెన్షన్ విచారకరం..
'నవంబర్ 1న సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాహుల్ గాంధీ ని దేశ భావి ప్రధానమంత్రిగా చేయాలనే దృఢ సంకల్పంతో, బీజేపీ ఓటు చోరీ కుట్రలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో భారీ బహిరంగ సభ నిర్వహించుకున్నాం.
ఇంతటి ముఖ్యమైన సభకు మీరు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ హాజరుకాకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో మీరు మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ ని ఆహ్వానించి రూ.3 కోట్లకు పైగా ఖర్చుతో నిర్వహించిన ఒక ప్రైవేటు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిసింది.
వ్యక్తిగత విశ్వాసాలను, మతపరమైన కార్యక్రమాలను నేను పూర్తిగా గౌరవిస్తాను. కానీ ఇటీవల మంథనిలో జరిగిన పరిణామాలపై నాలో ఆందోళన కలుగుతోంది. కొయ్యూరు ప్రభుత్వ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు, మా ‘కాకా వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్ ’ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులను పంపిణీ చేశాం.
గత 30 ఏళ్లుగా మా ట్రస్ట్ ద్వారా విద్యాభివృద్ధి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, ఇతర ప్రజాసేవా కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాం. కానీ ఈ సేవా కార్యక్రమానికి హాజరయ్యారనే కారణంపై ఒక గిరిజన మహిళా ప్రజాప్రతినిధితో సహా కాంగ్రెస్ కార్యకర్తలను మరుసటి రోజే షో కాజ్ నోటీస్ సైతం ఇవ్వకుండ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర విచారకరం.
సొంత కాంగ్రెస్ ఎంపీతో కలిసి పేద పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడమే క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తే... రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన సభకు హాజరుకాకపోవడాన్ని అంతకంటే తీవ్రమైన ఉల్లంఘనగా భావించాల్సి ఉంటుంది కదా! కానీ ఈ ఒక్కసారి సహజ న్యాయ సూత్రాలకు కట్టుబడి సభకు హాజరు కాని ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, విజయరమణారావులకు ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వరాదని, క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదని, వారిని సస్పెన్షన్ నుంచి మినహాయించాలని మిమ్మల్ని కోరుతున్నా.’పేర్కొన్నారు. అదే సమయంలో పేద విద్యార్థులకు బ్యాగులు పంచడం తప్పయినప్పుడు.. రాహుల్ గాంధీ గారి సభకు హాజరుకాకపోవడం అంతకంటే పెద్ద తప్పు ఎందుకు కాదో ఆలోచించాలన్నారు.
ఎమ్మెల్యేల పట్ల మీరు చూపే సహనం, న్యాయం, రక్షణ... దళిత, గిరిజన మహిళా ప్రజాప్రతినిధులకు, సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం సమానంగా అందుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ‘మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, లేదా ఒక గిరిజన వార్డు సభ్యురాలైనా... కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఒకే న్యాయం, ఒకే నియమం వర్తించాలి. కాంగ్రెస్‌లో అందరికీ ఒకే న్యాయం, ఒకే నియమం ఉండాలి. ' అని లేఖలో పేర్కొన్నారు.
