హైదరాబాద్ రోడ్ల పక్కన చెత్త కనిపించొద్దు ..క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా ఉంచాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ రోడ్ల పక్కన చెత్త కనిపించొద్దు ..క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా ఉంచాలి: సీఎం రేవంత్ రెడ్డి
  • చెత్త సేకరణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
  • నిర్మాణాలు, పార్కులకు ఎస్టీపీ నీళ్లే వాడాలె
  • సీఎంసీ, ఎంఎంసీలకూ గ్రీన్ వాటర్ ట్యాంకర్లు
  • సిగ్నల్ ఫ్రీ సిటీకి సమగ్ర ప్లాన్ రెడీ చేయండి
  • అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ను దేశంలోనే అత్యుత్తమ ‘క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీ’గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిటీలో ఎక్కడా చెత్త కనిపించొద్దని, పారిశుధ్య నిర్వహణలో లోపాలుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిగ్నళ్ల దగ్గర వాహనాలు గంటల తరబడి ఆగిపోకుండా సిటీలో పూర్తిస్థాయి ‘సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ’ తెచ్చేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

సోమవారం జూబ్లీహిల్స్‌‌‌‌లోని తన నివాసంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీటి పొదుపు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దిశానిర్దేశం చేశారు. ప్రజా జీవనం మరింత సౌకర్యవంతంగా మారేలా క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులు తేవాలన్నారు. 

వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ

ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే విధానం గ్రేటర్‌‌‌‌లోని అన్ని డివిజన్లలో వంద శాతం అమలయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. చెత్త సేకరణలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సిటీలో రోజురోజుకూ పెరిగిపోతున్న నిర్మాణ వ్యర్థాల (సీ అండ్ డీ వేస్ట్) తరలింపునకు ప్రత్యేక యంత్రాంగం, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పారిశ్రామిక వాడల్లో వ్యర్థాల సమస్య రాకుండా ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అక్కడి చెత్తను ఎప్పటికప్పుడు తరలించి రీసైక్లింగ్ యూనిట్లకు పంపాలని ఆదేశించారు.

తాగునీళ్లు కాదు.. ఎస్టీపీ నీళ్లు

నిర్మాణ పనులు, భారీ పార్కుల నిర్వహణ, ల్యాండ్‌‌‌‌స్కేపింగ్, డివైడర్ల పచ్చదనం కోసం ప్రస్తుతం తాగునీటిని వృథాగా వాడుతున్నారని, దానికి బదులు మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నీటినే వాడాలని సీఎం సూచించారు. శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు జలమండలి తొలి విడతగా 19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్లతో సేవలు మొదలుపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ గ్రీన్ ట్యాంకర్లను వినియోగదారులకు మరింత చేరువ చేయాలని, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ సేవలను జీహెచ్ఎంసీకే పరిమితం చేయకుండా సైబరాబాద్ (సీఎంసీ), మల్కాజిగిరి (ఎంఎంసీ) మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనూ వెంటనే విస్తరించాలని ఆదేశించారు.

అండర్‌‌‌‌పాస్‌‌‌‌లు, ఎలివేటెడ్ కారిడార్లు

భాగ్యనగరవాసులను నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లలో కొత్త అండర్‌‌‌‌పాస్‌‌‌‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వాహనాలు అడ్డంకులు లేకుండా సాఫీగా సాగేలా రోడ్లపై ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దాలని సూచించారు. ట్రాఫిక్, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసి బాటిల్‌‌‌‌నెక్స్‌‌‌‌ను తొలగించాలని, ప్రజలకు రద్దీ లేని ప్రయాణం అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జీ సృజన తదితరులు పాల్గొన్నారు.