ఆక్లాండ్: టీ20 సిరీస్ గెలిచి జోరుమీదున్న టీమిండియా.. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రెడీ అయ్యింది. బుధవారం నుంచి మొదలయ్యే ఈ సిరీస్‌లో ఇండియా బౌలింగ్‌పైనే ప్రత్యేక దృష్టి నెలకొంది. రకరకాల కారణాలతో సీనియర్ బౌలర్లు జట్టుకు దూరం కాగా, పెద్దగా అనుభవం లేని నలుగురు యంగ్ బౌలర్లతో ఇండియా ఈ సిరీస్ ఆడబోతున్నది.
ప్రస్తుతం టీమ్‌లో గుర్నూర్ బ్రార్ (9), అన్షుల్ కాంబోజ్ (1), అకిబ్ నబీ (1), యష్ ఠాకూర్ ఉన్నారు. వీరందరు కలిసి ఇప్పటి వరకు ఆడింది కేవలం 11 వన్డేలు మాత్రమే. వాస్తవానికి ఈ బౌలింగ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను గెలవడమే కష్టం అనుకుంటే దీనికి అదనంగా మరో రెండు మ్యాచ్‌లను చేర్చారు. దాంతో ఈ అనుభవరాహిత్య బౌలింగ్ ఇప్పుడు టీమిండియాకు పెద్ద సవాల్‌గా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ వన్డే సిరీస్‌కు ఎంపికైన బౌలర్లలో ఎవరికీ న్యూజిలాండ్‌లో వన్డేలు ఆడిన అనుభవం లేదు.
అర్ష్‌దీప్‌పైనే భారం..
జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన మహ్మద్ సిరాజ్ (51 వన్డేల్లో 77 వికెట్లు) తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం జట్టును నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. ఏకైక ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ కూడా తొలి వన్డే తర్వాత వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ సన్నాహాల కోసం టీమ్‌ను విడిచిపెట్టనున్నాడు. దాంతో 18 వన్డేల అనుభవం ఉన్న అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించాల్సి ఉంటుంది.
గుర్నూర్, అన్షుల్, అకిబ్ అనుభవం లేకపోవడం యష్ ఠాకూర్ ఇంకా అరంగేట్రం చేయాల్సి ఉండటంతో బౌలింగ్ భారాన్ని మొత్తం అర్ష్‌దీప్ సింగే మోయాల్సి ఉంటుంది. అయితే కివీస్ పిచ్‌లు ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ వికెట్లపై మూడో పేసర్‌ను ఎంచుకోవడం టీమిండియాకు పెద్ద సమస్యగా మారొచ్చు.
ముఖ్యంగా ఈడెన్ పార్క్ గ్రౌండ్ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ బ్యాటర్లు రెండు రన్స్ తీయలేరు. సింగిల్ లేదా బౌండరీ, సిక్స్ కొట్టడం తప్ప మరో మార్గం ఉండదు. తుది జట్టులో సిరాజ్, అర్ష్‌దీప్ స్థానం ఖాయం కాగా, మూడో సీమర్ ప్లేస్ కోసం గుర్నూర్, అన్షుల్, నబీ మధ్య పోటీ నెలకొంది.
రన్స్‌ను ఆపడం కష్టమే..
గుర్నూర్‌కు 9 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నా.. రన్స్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఓవర్‌కు దాదాపు 8 రన్స్ ఎకానమీ రేటు (7.71)తో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్‌లో అదనపు వేగం ఉంది. తన 6 అడుగుల 5 అంగుళాల పొడవుతో బాల్‌ను గందరగోళానికి గురిచేసేలా బౌన్స్ కూడా వేయగలడు. కానీ అతని సహజమైన లెంగ్త్ కొద్దిగా వెనక్కి ఉండటంతో బ్యాటర్లు ఈజీగా సిక్సర్లు కొడతారు.
కంబోజ్, నబీల విషయానికొస్తే, వారి సగటు వేగం దాదాపు ఒకేలా (135 కిలోమీటర్లు) ఉన్నప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌లో వారు ఇంకా అనుభవం లేనివారే. అందువల్ల వారికి వివిధ జట్ల ఆట పరిస్థితులపై అవగాహన పెద్దగా లేదు. అదే టైమ్‌లో ఒత్తిడిలో ప్రణాళికలను అమలు చేయడంలో వెనుకబడొచ్చు. ఈ నలుగురు కొత్త ఆటగాళ్లలో వేగాన్ని మార్చడం, బ్లాక్‌హోల్ డెలివరీలలో (సాంప్రదాయ, వైడ్ యార్కర్లు) వైవిధ్యాలు చూపడం వంటి విలక్షణమైన నైపుణ్యాలు కలిగిన ఆటగాడు యశ్ ఠాకూర్ మాత్రమే.
అయితే, ఠాకూర్ తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక కాలేదు. ప్రస్తుత జట్టులో 124 వన్డే మ్యాచ్‌లలో 201 వికెట్లు తీసి ఇండియాలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచిన కుల్దీప్ యాదవ్, ఉపఖండం వెలుపలి పరిస్థితులలో కేవలం కొన్ని రకాల బౌలింగ్ శైలులకే పరిమితమయ్యే బౌలర్‌గా మారాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరిస్తున్న 8వ స్థానం వరకు బ్యాటర్లతో బ్యాటింగ్ ఆర్డర్‌ను నింపే విధానం వల్ల కుల్దీప్‌కు జట్టులో చోటు కష్టంగా మారింది. కానీ జట్టుకు అనుభవం అవసరం ఉండటంతో గత టీ20 సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన కుల్దీప్‌కు ఈసారి ఆడే అవకాశం లభించొచ్చు.
