- సీపీ రష్మీ పెరుమాళ్‌కు బాధితుల ఫిర్యాదు
చేర్యాల, వెలుగు: నమ్మకంతో చిట్టీలు వేసిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఓ చిట్టీల నిర్వాహకుడు ఐపీ నోటీసులు పంపించి షాక్ ఇచ్చాడు. సుమారు 50 మంది నుంచి రూ.1.50 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన మహ్మద్ అజీజ్ అహ్మద్ కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయన వద్ద కూలీలు, వృద్ధులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన సుమారు 50 మంది చిట్టీలు వేశారు.
చిట్టీలు ఎత్తుకున్న వారు డబ్బులు అడగగా రేపు, మాపు అంటూ కాలయాపన చేశాడని బాధితులు తెలిపారు. తాజాగా చిట్టీదారులే తనకు అప్పులు ఇచ్చారని పేర్కొంటూ ఐపీ పిటిషన్ దాఖలు చేసి కోర్టు ద్వారా నోటీసులు పంపించడంతో బాధితులు ఆందోళనకు దిగారు.
తమకు డబ్బులు చెల్లించాల్సింది పోయి తమపైనే అప్పుల ఆరోపణలు చేయడంపై నిర్వాహకుడి ఇంటి ఎదుట నిరసన తెలిపారు. సుమారు రూ.1.50 కోట్ల మేర మోసం జరిగిందని, తమకు న్యాయం చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్‌ను బాధితులు కోరారు. ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేశారు.
