హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్స్ క్లాస్‌రూమ్స్‌లో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని నిజజీవితంలో ప్రాక్టికల్‌గా ఎలా వాడుకోవాలో నేర్పించడమే అనుభవాధారిత అభ్యసనం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ పెంచడంతో పాటు స్టూడెంట్లకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించి, ఇండస్ట్రీ అవసరాలకు సరిపడా స్కిల్స్ నేర్పించడం ద్వారా వాళ్లకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.
సోమవారం సచివాలయంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి రాసిన ‘అనుభవాధారిత అభ్యసనం – ఉన్నత విద్యలో ఒక నూతన మార్పు’ పుస్తకాన్ని టాస్క్, ఏడబ్ల్యూఎస్ ప్రతినిధులతో కలిసి ఆయన రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, డిగ్రీ, పీజీ స్టూడెంట్లకు దీనిపై పూర్తి అవగాహన కల్పించి విస్తృతంగా వాడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. క్లాస్‌రూమ్ చదువులను బయటి ప్రపంచపు అనుభవాలతో లింక్ చేయడమే లక్ష్యంగా.. ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమలతో భాగస్వామ్యం చేసి స్టూడెంట్లలో క్రియేటివిటీ, వృత్తిపరమైన స్కిల్స్ పెంచేలా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు వివరించారు.
