- వాళ్లు తెచ్చే బిల్లులను అడ్డుకుంటా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్ (చట్టసభ) మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డెమోక్రాట్లు మెజారిటీ సాధించి కాంగ్రెస్‌ను కైవసం చేసుకుంటే, తాను మిస్టర్ వీటోగా మారుతానని హెచ్చరించారు. డెమోక్రాట్లు ముందుకు తెచ్చే బిల్లులను తన వీటో అధికారంతో అడ్డుకుంటానన్నారు. ఈమేరకు ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. డెమోక్రాట్లు తమ ఆధీనంలో ఉన్న కాంగ్రెస్ ద్వారా బిల్లులు ఆమోదించుకోవడానికి ప్రయత్నిస్తే, వాటిని తాను వీటో ద్వారా తిరస్కరిస్తానని చెప్పారు. తాము పంపే బిల్లులన్నీ అధ్యక్షుడు వీటో చేస్తుంటే డెమోక్రాట్లు కాలయాపన చేయడం మాని, చివరికి చర్చల కోసం తన వద్దకు రాక తప్పదన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇరు పార్టీలు కలిసి రాజీకి వచ్చి ఒప్పందాలు చేసుకోవడం కొత్తేమీ కాదని గుర్తుచేశారు. రిపబ్లికన్ పార్టీయే కాంగ్రెస్‌పై పట్టు నిలుపుకుంటుందని తాను గట్టిగా ఆశిస్తున్నానని, ఒకవేళ అది జరగకపోతే మాత్రం ప్రతి బిల్లునూ వీటో చేస్తూనే ఉంటానన్నారు. అమెరికా రాజ్యాంగం ఒక వ్యక్తిని 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి అనుమతిస్తోందని, నిబంధనలు కఠినంగా లేకపోతే తాను మరోసారి పోటీ చేయడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు. అమెరికాలో మంగళవారం(నవంబర్ 3న) మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని 100 స్థానాల్లో 35 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ ఉండగా, దాన్ని తిరిగి దక్కించుకోవడానికి డెమోక్రాట్లకు కేవలం 3 స్థానాలు అవసరమవ్వడంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
