- కోర్టుకు సారీ చెప్పిన నటుడు
ముంబై: ఓవర్సీస్ సిటిజన్ కార్డుతో ఇండియాలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో ఎలా పాల్గొంటారని నటుడు ఇమ్రాన్ ఖాన్‌ను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఆయన అమెరికా పౌరసత్వాన్ని గుర్తుచేస్తూ.. అమెరికాలో భారత పౌరుడు ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొంటే అధికారులు ఊరుకుంటారా అని నిలదీసింది. వెంటనే ఫ్లైట్ ఎక్కించి ఇండియాకు పంపించేవారని కోర్టు వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లూ ఇండియాలోనే ఉంటూ బాలీవుడ్ స్టార్‌గా ఎదిగినప్పుడు భారత పౌరసత్వం ఎందుకు తీసుకోలేదని ఆయనను ప్రశ్నించింది.
ఈ మేరకు తనకు అందిన ‘లీవ్ ఇండియా’ నోటీసులను సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్భంగా నటుడిపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్‌తో దేశంలో ఉంటూ భారతీయ పౌరుడికి ఉన్న రాజ్యాంగ హక్కులను అనుభవించలేరని, రాజకీయ నిరసనల్లో పాల్గొనే హక్కు లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కోర్టుకు ఇమ్రాన్ ఖాన్ క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో దేశంలో ఎలాంటి రాజకీయ లేదా ర్యాలీలో పాల్గొనబోనని, ఇతరులను కూడా అందుకోసం ప్రేరేపించబోనని కోర్టుకు హామీ ఇచ్చారు. పుట్టుకతోనే అమెరికన్ పౌరసత్వం పొందినప్పటికీ.. తన జీవితమంతా భారత్‌లోనే గడిపానని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు. ప్రదర్శన వెనుక ఉన్న తీవ్రత, పర్యవసానాలు తెలియక అందులో పాల్గొన్నానంటూ క్షమాపణలు కోరారు.
