- టెక్సాస్ నుంచి బహామాస్ వెళ్తుండగా ప్రమాదం
- గ్రీన్‌ఏకర్స్ జనావాసాల మధ్య పేలిన విమానం
- ట్రంప్ నివాసానికి 8 మైళ్ల దూరంలో ఘటన
- ‘మేడే.. మేడే.. నేలను ఢీకొట్టబోతున్నం’ అంటూ పైలెట్ల ఆఖరి సందేశం
గ్రీన్‌ఏకర్స్(ఫ్లోరిడా): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బహమాస్ వెళుతున్న ఓ ప్రైవేట్ విమానం జనావాసాల మధ్య కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. లియర్‌జెట్ 60 రకానికి చెందిన ఓ చిన్న ప్రైవేట్ విమానం టెక్సస్‌లోని ఆస్టి-న్‌బెర్గ్‌స్ట్రోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బహామాస్‌లోని నార్త్ ఎలుథెరాకు వెళ్తుండగా ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) వివరాల ప్రకారం.. విమానం 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న టైంలో తీవ్రమైన ప్రతికూల వాతావరణం, టర్బులెన్స్, విమాన రెక్కలపై మంచు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఎత్తును మరింత పెంచేందుకు పైలట్లు అనుమతి కోరారు.
విమానం సుమారు 41,000 అడుగుల ఎత్తుకు చేరుకున్న అనంతరం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి నిట్టనిలువుగా భూమిపైకి దూసుకువచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ఆడియో రికార్డుల ప్రకారం.. విమానం నిమిషానికి 10 వేలు, 20 వేలు, 30 వేల అడుగుల కంటే ఎక్కువ వేగంతో కింద పడిపోయింది.
మేడే.. మేడే.. మేం పడిపోతున్నాం..
విమానం కూలే కొద్ది క్షణాల ముందు పైలట్లు ‘‘మేడే.. మేడే.. మేం నిమిషానికి 10,000 అడుగుల వేగంతో కిందకు పడిపోతున్నాం.. ఓవర్‌స్పీడ్ స్థితిలో ఉన్నాం.. మరికాసేపట్లో నేలను ఢీకొట్టబోతున్నాం’’ అంటూ కంట్రోల్ రూమ్‌కు సందేశాలు పంపారు. మరో మహిళా సిబ్బంది ‘అయ్యో.. మనకిక సమయం లేదు’ అని కేకలు వేసినట్లు రికార్డింగ్‌లో నమోదైంది.
మిసైల్‌లా వేగంగా దూసుకొచ్చిన ఫ్లైట్.. గ్రీన్‌ఎకర్స్‌లోని నివాస ప్రాంతంలో పడి భారీ శబ్దంతో పేలిపోయింది. ప్రమాద తీవ్రతకు ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల కిటికీలు ఊగిపోయాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. విమానం భూమిపైకి దూసుకొచ్చిన దాటికి ఘటనా స్థలంలో రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది.
ట్రంప్ ఎస్టేట్ దగ్గర్లో ప్రమాదం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎస్టేట్ ‘మార్-ఎ-లాగో’కు పశ్చిమాన సుమారు 7-– 8 మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొందని జాతీయ వాతావరణ విభాగం తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
