బీసీలను మోసం చేస్తున్న అమిత్ షా రాజీనామా చేయాలె : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలను మోసం చేస్తున్న అమిత్ షా రాజీనామా చేయాలె : జాజుల శ్రీనివాస్ గౌడ్
  •     ఓబీసీ కాలం చేర్చకపోతే బీజేపీకి ఘోరి కడతం  
  •     కిషన్ రెడ్డి మాట్లాడకపోవడం సిగ్గుచేటు
  •     బీజేపీలో చీము నెత్తురు ఉన్న బీసీలు మోదీ, అమిత్ షాపై తిరగబడాలి
  •     జాజుల శ్రీనివాస్ గౌడ్

అంబర్​పేట్, వెలుగు: బీసీలను మోసం చేస్తున్న అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని, బీసీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గోరీ కట్టడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీజేపీలో చీము నెత్తురు ఉన్న బీసీలు మోదీ, అమిత్ షా లపై తిరగబడాలని, ఓబీసీ కాలంపై నిర్ణయం తీసుకోకపోతే బీజేపీ జాతీయ నేతలు ఇకపై రాష్ట్రానికి ఎవరు వచ్చిన అడ్డుకుంటామని హెచ్చరించారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ అంబర్ పేటలోని మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి ధర్నా చేశారు. 

జాజుల మాట్లాడుతూ బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీల ఓట్లతో గెలిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఓబీసీ కాలం చేర్చే వరకు, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఈ అంశంపై డిసెంబర్ 14,15 తేదీల్లో ఢిల్లీని వేలాది మందితో ముట్టడించనున్నామని చెప్పారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, కుందారం గణేశ్ , జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ , తాటికొండ విక్రమ్, కనకాల శ్యాం , పిట్ల శ్రీధర్, ఉప్పరి శేఖర్, మురళి కృష్ణ, కాటేపల్లి వీరాస్వామి, జాజుల లింగం, గొడుగు మహేష్, ఈడిగ శ్రీనివాస్ , రావులకోల్ నరేష్, కెవి గౌడ్, కౌల జగన్నాథం, దేవిక, శ్రావణి, అంజమ్మ, నరసమ్మ, పాల్గొన్నారు.