- జీడబ్ల్యూఎంసీలో 11 లక్షల జనాభా..
10 లక్షల మంది రాకపోకలు - మరో నిధుల లేమీతో ట్రైసిటీలో మూతపడ్డ ‘పట్టణ ప్రగతి’
- ఫ్రీ టాయిలెట్లు,ఎమర్జెన్సీ ‘షీ టాయిలెట్ల’కు నీటి కనెక్షన్లు బంద్
- రూ.10 కోట్లు ఖర్చు చేసినా పబ్లిక్ కు నరకయాతన తప్పట్లే
- ప్రైవేటు వ్యక్తులకు నిర్వహణ అప్పగించే
- ఆలోచనలో ఆఫీసర్లు!
వరంగల్, వెలుగు : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా భావించే గ్రేటర్ వరంగల్ నగర ప్రజలకు మరుగుదొడ్ల తిప్పలు తప్పట్లేదు. వరంగల్ స్మార్ట్ సిటీలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి హడావుడిగా ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి.
ట్రైసిటీలో లక్షల మంది జనాభాకు తోడు, వివిధ పనుల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వరంగల్ సిటీకి వస్తుంటారు. వారు ఆయా పనుల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో ఉండే క్రమంలో అత్యవసర సమయంలో మలమూత్ర విసర్జన కోసం ఏర్పాటు చేసిన జీడబ్ల్యూఎంసీ పబ్లిక్ టాయిలెట్లు ప్రస్తుతం పని చేయడం లేదు. మహిళల కోసం ఏర్పాటు చేసిన షీ టాయిలెట్ల నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో సిటీకి వచ్చే జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రోడ్లపైకి 20 లక్షల మంది..
గ్రేటర్ వరంగల్ సిటీ 407.70 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. 66 డివిజన్లు, విలీన గ్రామాలతో కలిపి నగరంలో 11 లక్షల మంది జనాభా ఉంది. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలతో పాటు హైదరాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మంచిర్యాల ప్రాంతాల నుంచి దాదాపు 10 లక్షల మంది నిత్యం ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ పనుల కోసం వరంగల్ నగరానికి వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలో మెజారిటీ జనాలు పబ్లిక్ టాయిలెట్లను రోజుకు రెండు, మూడు సార్లు
వినియోగించుకుంటుంటారు.
తాళాలేసిన్రు.. నల్లాలు బంద్ చేసిన్రు
గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలో జీడబ్ల్యూఎంసీ పర్యవేక్షించే సుమారు అన్ని పబ్లిక్ టాయిలెట్లకు ప్రస్తుతం తాళాలే దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడ ఒకట్రెండు తెరిచి పెట్టినా వాటర్ సరఫరా కట్ చేశారు.
దీంతో జనాలు పబ్లిక్ టాయిలెట్ల వద్దకెళితే, కొన్ని చోట్ల డోర్ లాక్‌లు దర్శనమిస్తుంటే, మరికొన్ని చోట్ల కంపును భరించలేక అక్కడినుంచి వెనుదిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో పురుషులు ఖాళీ స్థలాలను వెతుక్కుంటుండగా, మహిళలు ఎమర్జెన్సీని ఆపుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు ఎక్కడపడితే అక్కడ బహిరంగ మూత్ర విసర్జన చేస్తూ స్మార్ట్ సిటీ అర్థాన్ని మార్చేస్తున్నారు. కాగా, జీడబ్ల్యూఎంసీ అధికారులు నిధుల్లేవనే పేరుతోనే పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను గాలికొదిలేసినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఏకంగా ఫ్రీ పబ్లిక్ టాయిలెట్లను ఎత్తేసి, వీటి నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకే అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే.. ఇష్టారీతిన బహిరంగ మలమూత్ర విసర్జన పెరిగి వరంగల్ స్మార్ట్ సిటీ కంపుమయం కావడం ఖాయమని పలువురు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు.
టాయిలెట్ల కోసం రూ.10 కోట్ల ఫండ్స్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) తరఫున దాదాపు రూ.10 కోట్ల పట్టణ ప్రగతి నిధులతో వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాల్లో సుమారు 141 టాయిలెట్లు నిర్మించారు. ఆపై 60 నుంచి 70 పబ్లిక్ టాయిలెట్లు, మరో 8 నుంచి 10 కమ్యూనిటీ టాయిలెట్లతో పాటు మహిళల కోసం రెండు బస్సుల్లో మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేశారు.
లక్షలాది రూపాయలతో వీటి నిర్వహణను జీడబ్ల్యూఎంసీ చేపట్టింది. పట్టణ ప్రగతి టాయిలెట్ మానిటరింగ్ సిస్టమ్ (పీపీ–టీఎంఎస్) మొబైల్ ఆధారిత ఐసీటీ వ్యవస్థను ప్రవేశపెట్టి నగరంలోని టాయిలెట్ల శుభ్రతను నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మెయింటెనెన్స్, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి పేరుతో మరో 50 టాయిలెట్ల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు.
‘పే అండ్ యూజ్’ అమలు చేస్తాం
జీడబ్ల్యూఎంసీ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు ఇన్ని రోజులు పట్టణ ప్రగతి నిధులను సమకూర్చాం. ప్రస్తుతం ఆ నిధులు అందుబాటులో లేవు. అందువల్లనే నిర్వాహకులు పలుచోట్ల టాయిలెట్లకు తాళాలు వేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం. లేదంటే ఇన్నాళ్లు పట్టణ ప్రగతి నిధులను తీసుకుని నిర్వహణ చూసిన వారి చేతికే ‘పే అండ్ యూజ్’ పద్ధతిలో నిర్వహణను అప్పజెబుతాం.
- రాజారెడ్డి(జీడబ్ల్యూఎంసీ, సీఎంహెచ్ఓ)–
