మోదీ.. నీ సంగతి చూస్తం... ఓట్ చోరీ దేశద్రోహం.. ఎవర్నీ వదలం: రాహుల్ గాంధీ

మోదీ.. నీ సంగతి  చూస్తం... ఓట్ చోరీ దేశద్రోహం.. ఎవర్నీ వదలం: రాహుల్ గాంధీ
  • జ్ఞానేశ్ కుమార్​ జైలుకెళ్లడం ఖాయం
  • తర్వాతి వంతు మీదే.. మోదీ, షాలకు వార్నింగ్
  • 2024 ఎన్నికలు కూడా అక్రమమే
  • ఎన్డీయే, ఇండియా కూటమిల ఓట్ల తేడా 3 శాతమే
  • ఓట్లు కొల్లగొట్టి కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు
  • సీఈసీ సహకారం లేకుంటే మోదీ ప్రధాని అయ్యేవారే కాదు
  • ఈ ర్యాలీ దేశ యువత, మహిళల సామాన్యుల గొంతు
  • ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి మహా గర్జన 

న్యూఢిల్లీ: ఓట్ చోరీ సాధారణ దొంగతనం కాదని, దేశద్రోహంతో సమానమైన ఈ దారుణానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో దేశ ప్రజల ఓటు హక్కును హరించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయమని, భవిష్యత్తులో దేశద్రోహం నేరం కింద ఆయన విచారణ ఎదుర్కొక తప్పదన్నారు. జ్ఞానేశ్ కుమార్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సంగతి చూస్తామని, ఓట్ చోరీకి పాల్పడిన నేరానికి ఆయనను చట్టం ముందు నిలబెడతామని తేల్చిచెప్పారు. జ్ఞానేశ్ కుమార్ సహకారం లేకపోతే మోదీ ప్రధాని, అమిత్ షా హోంమంత్రి అయ్యే వారే కాదన్నారు. మోదీ, అమిత్​షా ఎక్కడికీ వెళ్లలేరని, చట్టం నుంచి తప్పించుకుని వెళ్లాలనుకున్నా తాము వదలబోమని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్, ఎన్నికల్లో అక్రమాలపై ఆదివారం ఢిల్లీలోని రామ్‌‌లీలా మైదాన్‌‌లో కాంగ్రెస్‌‌ నేతృత్వంలోని ఇండియా కూటమి సభలో  రాహుల్ గాంధీ మాట్లాడారు. 

ఈ ర్యాలీ కేవలం ఒక రాజకీయ పార్టీ లేదా నాయకుడి గొంతుక కాదని, దేశంలోని యువత, మహిళలు, రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల గొంతుక అని రాహుల్ పేర్కొన్నారు.

విచారణ ఎదుర్కోవాల్సిందే.. 

‘‘జ్ఞానేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ జైలుకు వెళ్తారు. ఆ తర్వాత మోదీ సంగతి చూస్తం. దేశానికి న్యాయం జరిగేలా చూస్తం. ఈ నేరానికి విచారణ ఎదుర్కొని, చట్టపరంగా శిక్షను అనుభవించాల్సిందే. మోదీ, అమిత్​షా.. మీరు పారిపోవాలని చూడొద్దు. ఎక్కడికి వెళ్లినా శిక్ష తప్పించుకోలేరు” అని రాహుల్‌‌‌‌ అన్నారు. దేశ సంపదను అదానీకి అప్పగించడంపైనా న్యాయం కోసం పోరాడతామని చెప్పారు. ఎంత అధికారం, డబ్బు ఉన్నా రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవారు కారని స్పష్టం చేశారు.ఈ ర్యాలీ రాజకీయ పార్టీలు, నాయకుల గొంతుక మాత్రమే కాదని, యువత, రైతులు, కార్మికుల గొంతుక అని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేయనివ్వబోమని ప్రజలు చాటుతున్నారని రాహుల్ కొనియాడారు.

మోదీ, షాలపై వ్యక్తిగత ద్వేషం లేదు..

మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ లపై తమకేమీ వ్యక్తిగత ద్వేషం లేదని రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌‌‌‌ ‘మొహబ్బత్‌‌‌‌ కీ దుకాన్‌‌‌‌’ సిద్ధాంతాన్ని నమ్ముతుందని, అహింస తమ మార్గమని చెప్పారు. వారిపై హింసకు పాల్పడబోమని, ద్వేషాన్ని వ్యాప్తి చేయబోమని, ప్రేమతోనే పోరాడతామని అన్నారు. “నా మతం ఏమిటని అడిగితే ప్రతి పౌరుడి గొంతు వినిపించడమే నా మతమని చెబుతా” అని వ్యాఖ్యానించారు. హిందూ, ముస్లిం, సిక్కు, దళిత, ఆదివాసీ, మహిళ, దివ్యాంగుడు.. ఇలా ప్రతి ఒక్కరి గొంతును కాపాడాలని మహాత్మాగాంధీ బోధనలను గుర్తుచేశారు. 

కాగా, దేశంలోని అన్ని వ్యవస్థలనూ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ తన ఆధీనంలోకి తెచ్చుకుందని, ఫలితంగా రైతులు, కార్మికులు, యువతకు హక్కులు దక్కడం లేదని రాహుల్‌‌‌‌ ఆరోపించారు. దేశ సంపద రెండు, మూడు సంస్థల చేతుల్లోకి వెళ్తోందని, భారీ రుణమాఫీలు పొందే వారికి ఒకవైపు ప్రయోజనం కలుగుతుండగా, చిన్న రుణం చెల్లించలేని రైతు బిడ్డ జైలుకు వెళ్తున్నాడని విమర్శించారు. అదానీ ఏ సంస్థనైనా, మౌలిక సదుపాయాలనైనా తన ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి దేశంలో ఉండకూడదని అన్నారు. దేశాన్ని తిరిగి సరైన దారిలో పెట్టాలంటే ముందుగా జ్ఞానేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ను పదవి నుంచి తొలగించాలని పేర్కొన్నారు.

ర్యాలీలో ఎవరెవరు పాల్గొన్నారంటే..

‘ఓట్ బాచావో, దేశ్ బాచావో’ పేరుతో చేపట్టిన ఈ మహా ర్యాలీలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ఎన్సీపీ (ఎస్‌‌‌‌పీ) నేత సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, కేసీ వేణుగోపాల్, దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.

సర్​ ఓటు హక్కులపై సర్జికల్‌‌‌‌ స్ట్రైక్‌‌‌‌: దీపాంకర్​ భట్టాచార్య

రాజ్యాంగం దేశ ప్రజలకు ఇచ్చిన ఓటు హక్కును లాక్కునేందుకు ప్రభుత్వం చేపట్టిన సర్జికల్ స్ట్రేకే ఈ ఎస్ఐఆర్ అని సీపీఐ(ఎంఎల్‌‌‌‌) లిబరేషన్‌‌‌‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌‌‌‌ భట్టాచార్య ఆరోపించారు. ఇండియా కూటమి ర్యాలీలో భట్టాచార్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటు హక్కుతోపాటు నిరసన తెలిపే హక్కుపైనా దాడి జరుగుతోందని మండిపడ్డారు. జంతర్‌‌‌‌ మంతర్‌‌‌‌ వద్ద నిరసనకు అనుమతించకపోవడం ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని చూశారని విమర్శించారు.  

ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం: ఎంఏ బేబీ

రామ్‌‌‌‌లీలా మైదాన్‌‌‌‌లో జరిగిన కూటమి సభను రెండో స్వాతంత్ర్య పోరాటంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అభివర్ణించారు. దేశాన్ని ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి కాపాడుకునేందుకు చేపట్టిన పోరాటమని కొనియాడారు.  

ఏడుగురిలో ఒకరి ఓటు తీసేశారు..
దేశంలో 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికలే అక్రమమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘దొంగిలించిన’ మెజారిటీతోనే కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమేనని గుర్తుచేశారు. ఈవీఎంలతో, ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించి, కొత్త పేర్లను చేర్పించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని, ఓట్ చోరీ జరిగిందని ఆయన వివరించారు. ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి 13.5 కోట్ల పేర్లు తొలగించారని చెప్పారు. అంటే.. ప్రతీ ఏడుగురు ఓటర్లలో ఒకరి పేరు తీసేశారని, ఇది మొత్తం ఓటర్లలో దాదాపు 15 శాతమని  రాహుల్ తెలిపారు. ఈ గణాంకాలే 2024 ఎన్నికలు అక్రమంగా జరిగాయనడానికి నిదర్శనమని వివరించారు.