పల్లెల్లో జలసిరి.. రాష్ట్ర వ్యాప్తంగా 5.87 లక్షల పనులకు శ్రీకారం..!

పల్లెల్లో జలసిరి.. రాష్ట్ర వ్యాప్తంగా 5.87 లక్షల పనులకు శ్రీకారం..!
  • రాష్ట్ర వ్యాప్తంగా 5.87 లక్షల పనులకు శ్రీకారం
  • భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ
  • 51,737 పనులు ప్రారంభం.. ఇప్పటికే 12,368 పూర్తి
  • 5 లక్షల ఇంకుడు గుంతలు.. 50 వేల ఫామ్ పాండ్ల నిర్మాణం
  • బోర్లు, ఊర చెరువుల రీఛార్జ్‌‌‌‌‌‌‌‌పైనా ప్రత్యేక దృష్టి
  • ఎల్-నినో ముప్పును ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళిక
  • వేసవి రాకముందే పనులు పూర్తి చేయాలని ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: భూగర్భ జలాలను పెంచడం.. భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా చూడటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసిరి పనులు పల్లెల్లో వేగం పుంజుకున్నాయి. ఎల్-నినో ప్రభావంతో వర్షాలు తగ్గినా.. సాగు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,87,647 జల సంరక్షణ పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఇప్పటికే 51,737 పనులు ప్రారంభం కాగా.. 12,368 పూర్తయ్యాయి. మిగిలిన పనులను వచ్చే వేసవికి ముందే పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 

వర్షపు నీటిని ఒడిసిపట్టి, అవసరమైనప్పుడు పంటలకు అందించేందుకు ఫామ్ పాండ్ల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల రైతు కుంటలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 14,946 చోట్ల పనులు ప్రారంభించగా.. 2,485 కుంటలు పూర్తయ్యాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితుల్లో ఈ కుంటల ద్వారా జీవనాధార తడులు అందించవచ్చు. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులకు వెసులుబాటు కలుగుతుంది.

5 లక్షల ఇంకుడు గుంతలు

గ్రామాల్లో మురుగునీటి సమస్యను తగ్గించడంతోపాటు వృథా నీటిని భూమిలోకి ఇంకించేలా మ్యాజిక్ సోక్‌‌‌‌‌‌‌‌పిట్ల నిర్మాణం చేపట్టారు. జలసిరిలో భాగంగా 5 లక్షల ఇంకుడు గుంతలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 30,216 చోట్ల పనులు ప్రారంభించగా.. 9 వేలకుపైగా పూర్తయ్యాయి. ఇళ్ల వద్ద, చేతిపంపుల దగ్గర వృథాగా పారే నీటిని ఈ గుంతల్లోకి మళ్లించి భూమిలోకి ఇంకిస్తున్నారు. దీంతో గ్రామాలు పరిశుభ్రంగా మారడంతోపాటు సమీపంలోని వ్యవసాయ బావులు, చేతిపంపుల్లో నీటి ఊట పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఎండిపోయిన బోర్లకు మళ్లీ జీవం

నీటి మట్టాలు పడిపోవడంతో నిరుపయోగంగా మారిన వ్యవసాయ బోరుబావులను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు రీఛార్జ్ పనులు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల బోర్లను రీఛార్జ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 2,476 పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 700 వరకు పూర్తయ్యాయి. బోర్ల వద్ద నీటిని నిల్వ చేసి భూమిలోకి ఇంకించేందుకు మరో 13,647 ప్రత్యేక ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో 3,660 పనులు మొదలవగా.. 609 పూర్తయ్యాయి. అలాగే 12 వేల ఊర చెరువుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 439 చోట్ల పనులు ప్రారంభించి.. 31 చెరువులను పునరుద్ధరించారు. 

నెలలవారీగా పనుల షెడ్యూల్

జలసిరి పనులను వర్షాలు, పంటల సీజన్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా చేపట్టేలా ప్రభుత్వం నెలవారీ కార్యాచరణ రూపొందించింది. పంట కోతలు పూర్తికాగానే ఫామ్ పాండ్లు, సామూహిక నీటి నిల్వ కుంటలు, బోర్ల రీఛార్జ్ పనులను వేగవంతం చేయనున్నారు. వాగులు, వంకలపై చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌‌‌‌‌లు, స్టోన్ గల్లీ ప్లగ్గుల నిర్మాణం, సామూహిక చెరువుల్లో పూడికతీత చేపట్టనున్నారు. మార్చి నుంచి మే వరకు ఊర చెరువుల లోతు పెంచడం, రూఫ్‌‌‌‌‌‌‌‌టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గత అక్టోబర్ 2న నిర్వహించిన గ్రామసభల్లో గుర్తించిన అన్ని జల సంరక్షణ పనులను వచ్చే ఏడాది వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జలసిరి పనుల ప్రగతి పట్టిక రూపంలో.. 
 
    లక్ష్యం    ప్రారంభం    పూర్తయినవి
మొత్తం పనులు    5,87,647    51,737    12,368
మ్యాజిక్ ఇంకుడు గుంతలు    5,00,000    30,216    9000
ఫామ్ పాండ్స్ (పంట కుంటలు)    50,000    14,946    2,485
బోరుబావుల రీచార్జ్    12,000    2,476    700
బోర్ల వద్ద ఇంకుడు గుంతలు    13,647    3,660    609
చెరువుల పనులు    12,000    439    31