అబిడ్స్, వెలుగు : ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల పరిరక్షణతో పాటు పెన్షనర్ల హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు అవసరమని జనరల్ ఇన్సూరెన్స్ రిటైర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. హైదరాబాద్ అబిడ్స్‌లో నిర్వహించిన అసోసియేషన్ రెండో జనరల్ బాడీ సమావేశంలో పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ వై.సుధాకర్ రావు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులు పెరుగుతున్న వైద్య ఖర్చులు, అధిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
రిటైరీల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ భారాన్ని పూర్తిగా తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షన్ కమ్యూటేషన్ జరిగిన 11.3 సంవత్సరాల అనంతరం పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించాలని, ఈ విషయంలో న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రాంబాబు , ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ డీజీఎం ఎస్.ఎల్. గిరిధర్ , ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ యూ. బెనర్జీ , అసోసియేషన్ సౌత్ జోన్ అధ్యక్షులు కుమారవేలు , సౌత్ జోన్ జనరల్ సెక్రటరీ జాన్ పాల్ , హైదరాబాద్ బ్రాంచ్ అధ్యక్షులు జీవిఎల్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
