ఏపీలో ప్రశాంతంగా మున్సిపోల్స్ రేపే కౌంటింగ్.. రిజల్ట్స్  

ఏపీలో ప్రశాంతంగా మున్సిపోల్స్ రేపే కౌంటింగ్.. రిజల్ట్స్  

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థలకు (13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలు) జరిగిన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. నిర్ణీత గడువు ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు.

ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం నిర్వహించి, అదే రోజు తుది ఫలితాలను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌‌‌‌‌‌‌‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా మీడియాకు తెలిపారు. 

విజయవాడ 55వ డివిజన్‌‌‌‌‌‌‌‌లో గుర్తులు తారుమారు 

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లోని 55వ డివిజన్‌‌‌‌‌‌‌‌లోబ్యాలెట్ పేపర్‌‌‌‌‌‌‌‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో ఓటింగ్‌‌‌‌‌‌‌‌ను ఆలస్యంగా ప్రారంభించారు. దీంతో అక్కడి ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పోలింగ్ సమయాన్ని రాత్రి 7.30 గంటల వరకు పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.  శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు వరకు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని ఎస్‌‌‌‌‌‌‌‌ఈసీ పేర్కొన్నారు.

అయితే కడప, అనంతపురం, పల్నాడు జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన వివరించారు. పులివెందులలో పోలింగ్ ఏజెంట్ల నియామకాలపై వచ్చిన ఫిర్యాదుపై వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీతో మాట్లాడామని, క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్, ఎస్పీలు ఇచ్చే సమగ్ర నివేదికలు, రిపోర్టులను పరిశీలించిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.  

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు సగటున 48.03% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తుది ఓటింగ్ శాతానికి సంబంధించిన అధికారిక వివరాలను సోమవారం నాటికి వెల్లడించనున్నారు.