హైలో ఓపెన్‌‌ విజేత పీవీ సింధు..డెన్మార్క్‌‌ ప్లేయర్‌‌ లైన్‌‌పై వరుసగా గెలుపు ..ఈ సీజన్‌‌లో రెండో టైటిల్‌‌..

హైలో ఓపెన్‌‌ విజేత పీవీ సింధు..డెన్మార్క్‌‌ ప్లేయర్‌‌ లైన్‌‌పై వరుసగా గెలుపు ..ఈ సీజన్‌‌లో రెండో టైటిల్‌‌..

సార్‌‌బ్రూకెన్‌‌ (జర్మనీ): భారత స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు ఈ సీజన్‌‌లో రెండో టైటిల్‌‌ సాధించింది. ఆదివారం జరిగిన హైలో ఓపెన్‌‌ సూపర్‌‌-500 టోర్నీ మహిళల సింగిల్స్‌‌ ఫైనల్లో డెన్మార్క్‌‌కు చెందిన ప్రపంచ 25వ ర్యాంకర్‌‌ లైన్‌‌ హోజ్‌‌మార్క్‌‌ క్జెర్స్‌‌ఫెల్డ్‌‌పై 21-–12, 21–-14తో విజయం సాధించింది. 39 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌‌ సింధు.. జపాన్‌‌ ఓపెన్‌‌ తర్వాత మరో టైటిల్‌‌ను ఖాతాలో వేసుకుంది. 

గతవారం ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో రన్నరప్‌‌గా నిలిచిన ఆమె.. ఈ విజయంతో 9,200 ర్యాంకింగ్‌‌ పాయింట్లు సాధించింది. తద్వారా సీజన్‌‌ ముగింపు వరల్డ్‌‌ టూర్‌‌ ఫైనల్స్‌‌కు అర్హత సాధించే దిశగా ముందడుగు వేసింది. ఫైనల్లో సింధు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థి ర్యాలీలను కొనసాగించేందుకు ప్రయత్నించినా.. సింధు చురుకైన నెట్‌‌ ప్లే, పదునైన స్మాష్‌‌లతో పైచేయి సాధించింది. తొలి గేమ్‌‌ను 21-–12తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ 21–-14తో మ్యాచ్‌‌ను ముగించింది. పురుషుల సింగిల్స్‌‌ ఫైనల్లో లక్ష్యసేన్‌‌.. జొనాథన్‌‌ క్రిస్టీతో తలపడనున్నాడు.