ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ లో కబడ్డీకి చోటు కల్పించడమే లక్ష్యం : IFK అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ లో  కబడ్డీకి చోటు కల్పించడమే లక్ష్యం : IFK అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
  •     2030 కామన్వెల్త్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లోనూ ఈ క్రీడను చేర్చుతాం
  •     ఐకేఎఫ్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

హైదరాబాద్, వెలుగు: కబడ్డీ క్రీడను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడంతో పాటు 2036 ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో చోటు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్) అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లోనూ కబడ్డీని చేర్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కాసాని గ్రాండ్ హోటల్‌‌‌‌‌‌‌‌లో ఆయన అధ్యక్షతన ఐకేఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ కబడ్డీకి ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరగడంతోపాటు క్రీడాకారులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 

త్వరలో కబడ్డీ వరల్డ్ కప్ నిర్వహించడంతోపాటు, మహిళల ప్రీమియర్ లీగ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వరల్డ్ కప్ నిర్వహణపై ఆసక్తి ఉన్న దేశాల నుంచి ప్రతిపాదనలు, వివరాలు కోరామని, వాటిని పరిశీలించిన తర్వాత ఆతిథ్య దేశాన్ని ఖరారు చేస్తామని తెలిపారు. పురుషుల కబడ్డీ ప్రో గేమ్స్‌‌‌‌‌‌‌‌కు మంచి ఆదరణ లభించిందని, అదే తరహాలో మహిళల కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌లను నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం 62 దేశాలు కబడ్డీ క్రీడలో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. సమావేశంలో ఐకేఎఫ్ డైరెక్టర్లు వెంకటేశ్ బండారి, గోవింద్ నారాయణ్ శర్మతో పాటు 13 దేశాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.