ఆఫ్రికాలో తొలిసారి యూత్‌‌ ఒలింపిక్స్‌‌...సెనెగల్‌‌ లో ఘనంగా ప్రారంభం

ఆఫ్రికాలో తొలిసారి యూత్‌‌ ఒలింపిక్స్‌‌...సెనెగల్‌‌ లో ఘనంగా ప్రారంభం
  •     25 క్రీడల్లో 2,700 మందియువ అథ్లెట్ల పోటీ

డయామ్నియాడియో (సెనెగల్‌‌): ఆఫ్రికా ఖండంలో తొలిసారిగా ఒలింపిక్‌‌ క్రీడలు ప్రారంభమయ్యాయి. సెనెగల్‌‌ వేదికగా యూత్‌‌ ఒలింపిక్స్‌‌ శనివారం ఘనంగా మొదలయ్యాయి. డాకర్‌‌ సమీపంలోని డయామ్నియాడియో ఒలింపిక్‌‌ స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకలకు వేలాది మంది హాజరయ్యారు. వందలాది మంది కళాకారులు సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో ఆఫ్రికా సంస్కృతిని చాటారు. సెనెగల్‌‌ అధ్యక్షుడు బసిరు దియోమాయే ఫాయే క్రీడలను ప్రారంభించారు. ఈ నెల 13 వరకు జరిగే పోటీల్లో 14 నుంచి 17 ఏళ్ల వయసున్న సుమారు 2,700 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 

డాకర్‌‌, డయామ్నియాడియో, సాలీ నగరాల్లో 25 క్రీడాంశాల్లో 153 పతకాల ఈవెంట్లు జరగనున్నాయి. రష్యాకు చెందిన 13 మంది అథ్లెట్లు పోటీపడుతుండగా.. యూత్‌‌ ఒలింపిక్స్‌‌లో తొలిసారిగా శరణార్థుల జట్టు కూడా బరిలోకి దిగుతోంది. కెన్యా, ఉగాండాల్లో నివసిస్తున్న ఆరుగురు అథ్లెట్లు మూడు క్రీడాంశాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో ఆఫ్రికాలోని 54 దేశాల సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ క్రీడలు ఆఫ్రికా, ఒలింపిక్‌‌ కుటుంబానికి చారిత్రక ఘట్టమని ఐఓసీ అధ్యక్షురాలు కిర్‌‌స్టీ కోవెంట్రీ పేర్కొన్నారు.