హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను   ‘మాఫియా ఫ్రీ’ సిటీగా మారుస్తం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను   ‘మాఫియా ఫ్రీ’ సిటీగా మారుస్తం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 
  • నారెడ్కో 16వ ‘తెలంగాణ ప్రాపర్టీ షో’ ముగింపులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 
  • బాంబే, బెంగళూరు, ఢిల్లీల కంటే మన నగరంలోనే  అద్భుత వృద్ధి అని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇటీవల ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని, ప్రభుత్వం కూడా అలాంటి వారిని ప్రోత్సహించడం అత్యంత దారుణమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను మాఫియా ఫ్రీ నగరంగా మారుస్తామని, దీనికోసం ప్రజలు కూడా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదివారం హైటెక్స్ వేదికగా నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ ఎడిషన్ 'తెలంగాణ ప్రాపర్టీ షో' ముగింపు కార్యక్రమంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ నగరం నేడు న్యూయార్క్ మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో కనిపించడానికి రియల్ ఎస్టేట్ రంగమే ప్రధాన కారణమని కొనియాడారు. ముంబై, నోయిడా, ఢిల్లీ, బెంగళూరు కంటే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే రియల్ ఎస్టేట్ రంగం అత్యద్భుతంగా ఉందన్నారు.

అయితే ఇక్కడ తయారైన ల్యాండ్ మాఫియాను కట్టడి చేసి, సమస్యలను తొలగిస్తే నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రైల్ నిర్మాణాలకు భారీగా నిధులు వెచ్చిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో ఏకంగా 3 ప్రాజెక్టులను ఒక్క హైదరాబాద్ నగరానికే కేటాయించినట్లు వెల్లడించారు.

ప్రైవేట్ డెవలపర్లు కూడా ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ విధానంలో ఇళ్లు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, ప్రజా రవాణా వ్యవస్థలను సమగ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో నిర్మాణ వ్యయం సుమారు 3 నుంచి 5 శాతం తగ్గిందని, ఈ ప్రయోజనాలు నేరుగా గృహ కొనుగోలుదారులకు చేరేలా నారేడ్కో చొరవ తీసుకోవాలని కోరారు. 

తెలంగాణ సద్వినియోగం చేసుకోవాలె

రాష్ట్రాలకు పన్నుల వాటా 2014లో రూ.3.18 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ.15 లక్షల కోట్లకు పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. సాస్కీ స్కీము పథకం కింద 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాల రూపంలో రాష్ట్రాలకు రూ.4 లక్షల కోట్లకు పైగా అందించామని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిధులను స్థానిక మౌలిక ప్రాజెక్టులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన రూ. లక్ష కోట్ల ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ నగరాల రూపురేఖలను మార్చేందుకు గొప్ప అవకాశమన్నారు.

ప్రస్తుతం దేశ జీడీపీలో 7 శాతంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగ వాటా 2030 నాటికి 13 శాతానికి చేరుతుందని, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నారెడ్కో ప్రెసిడెంట్ కే.శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్​రావు, వైస్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్, మాజీ ఉపాధ్యక్షుడు గోపాలకృష్ణ, రవికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.