పద్మారావునగర్, వెలుగు : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జైపూర్ నుంచి ముంబయికి తరలిస్తున్న రూ. 60 లక్షల విలువైన నకిలీ కరెన్సీని సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ సంయుక్తంగా పట్టుకున్నాయి. అక్టోబర్ 31న ప్లాట్‌ఫారమ్ నంబర్ 10పై నిలిపి ఉన్న ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగును తనిఖీ చేయగా రూ.500 నోట్లకు చెందిన 12 కట్టల్లో రూ. 60 లక్షల విలువైన దొంగ నోట్లు బయటపడ్డాయి. నిందితుడు రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా శ్రీ దుంగర్‌గఢ్ ఠాణా పరిధి కల్యాణ్‌సర్‌కు చెందిన శివరతన్ మహీయ (19)గా తేలింది.
అదే ప్రాంతానికి చెందిన ఓం ప్రకాష్ అనే పాత నేరస్తుడి ద్వారా నకిలీ కరెన్సీ దందా చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శివరతన్‌కు ఈ నోట్ల బ్యాగును చేరవేస్తే రూ. 20 వేలు ఇస్తానని ఓం ప్రకాష్ ఆశ చూపాడు. కాచిగూడకు వెళ్లి అక్కడి నుంచి ముంబయి వెళ్లాలని చెప్పగా, మైసూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో కాచిగూడ చేరుకున్న నిందితుడు, అక్కడ లాడ్జిలో బస చేశాడు. వరదలతో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రద్దు కావడంతో, సికింద్రాబాద్ నుంచి ముంబయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. రైలు బయలుదేరే సమయానికే పోలీసులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రైల్వే ఎస్పీ వై. సాయిశేఖర్, డీఎస్పీ ఎస్.ఎన్. జావెద్ పర్యవేక్షణలో సిబ్బంది ఈ ఆపరేషన్ నిర్వహించారు.
