బస్తీ దవాఖానల్లో టెస్టులకు బ్రేక్..వారంలో మూడు రోజులే శాంపిల్స్ కలెక్షన్

బస్తీ దవాఖానల్లో టెస్టులకు బ్రేక్..వారంలో మూడు రోజులే శాంపిల్స్ కలెక్షన్
  •     ఒక్కో నర్సింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు       రెండు సెంటర్ల బాధ్యతలు  
  •     అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లతో కాలం వెళ్లదీత 
  •     పేద రోగులకు తప్పని తిప్పలు...

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ జిల్లాలోని బస్తీ దవాఖానల్లో సిబ్బంది కొరతతో సేవలు కుంటుపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 150కి పైగా బస్తీ దవాఖానల్లో సరిపడా నర్సింగ్ ఆఫీసర్లు లేక రోజూ వచ్చే వారిలో సగం మందికే  టెస్టులు  చేస్తున్నారు. ఒక్కో బస్తీ దవాఖానలో డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో పాటు నర్సింగ్ ఆఫీసర్, సపోర్ట్ స్టాఫ్ ఉండాలి. కానీ, ఖాళీలను భర్తీ చేయడంలో జిల్లా వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్లకే అదనంగా మరో దవాఖాన బాధ్యతలను అప్పగిస్తూ అధికారులు తాత్కాలిక సర్దుబాట్లు చేస్తున్నారు. ఒకే నర్సింగ్ ఆఫీసర్ వారంలో మూడు రోజులు ఒక సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో, మిగతా మూడు రోజులు మరో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో విధులు నిర్వర్తించాల్సి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా జరిగే దాదాపు 130 రకాల రోగ నిర్ధారణ పరీక్షలకు రోగుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో నమోదు చేయాల్సిన కీలక బాధ్యత నర్సింగ్ ఆఫీసర్లదే కావడంతో.. వారు డ్యూటీలో లేని రోజుల్లో బ్లడ్ శాంపిల్స్ సేకరణ పూర్తిగా నిలిచిపోతున్నది.

అడ్జస్ట్​మెంట్లతో సరి.. 

సిటీలో చాలా వరకూ బస్తీ దవాఖానలు అడ్జస్ట్​మెంట్లతో నడుస్తున్నాయి. నల్లకుంట పరిధిలోని నరసింహ బస్తీ దవాఖానలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండటంతో సమీపంలోని మదర్ డెయిరీ బస్తీ దవాఖాన సిబ్బందినే వారంలో మూడు రోజులు ఇక్కడికి డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై  పంపిస్తున్నారు. గోల్నాక గంగానగర్ బస్తీ దవాఖానలోనూ స్టాఫ్ నర్స్ లేక బతుకమ్మ కుంట సెంటర్ నుంచి, తిలక్ నగర్ బస్తీ దవాఖానకు మరో కేంద్రం నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నారు. అడిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెట్ పోచమ్మ బస్తీ దవాఖానతో పాటు జిల్లాలోని మెజారిటీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. నర్సింగ్ ఆఫీసర్ ఉన్న రోజుల్లో మాత్రమే శాంపిల్స్ కలెక్ట్ చేస్తుండటంతో, మిగతా రోజుల్లో పరీక్షల కోసం వచ్చే వృద్ధులు, గర్భిణులు, బస్తీ జనం డాక్టర్ కు చూపించుకొని టెస్టులు చేయించుకోకుండా వెనుదిరగాల్సి వస్తోంది. మరికొంత మంది పేషెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ క్లినిక్ లకు పోయి రూ. వేలు జేబుల నుంచి పెట్టుకుంటున్నారు. 

అధికారుల తీరుపై విమర్శలు
బస్తీ దవాఖానల్లో సమస్యలు ఉన్నా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఖాళీగా ఉన్న పోస్టులను రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ద్వారా భర్తీ చేయడం లేదు. ఒకరిని అటు.. మరొకరిని ఇటు తిప్పుతూ కాలయాపన చేస్తున్నారనే విమర్శలున్నాయి. సాధారణ జ్వరాలు, బీపీ, షుగర్ తో బాధపడే నిరుపేదలకు సత్వర పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రాథమిక దశలోనే రోగాలను గుర్తించడం కష్టతరంగా మారుతున్నది. మరోవైపు ఇద్దరు చేయాల్సిన పనిని ఒక్కరే చేయాల్సి వస్తుండడంతో నర్సింగ్ ఆఫీసర్లు తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నారు. నామమాత్రపు అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లతో చేతులు దులుపుకోకుండా, వెంటనే బస్తీ దవాఖానల్లో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసి, పేదలకు  పూర్తిస్థాయిలో ల్యాబ్ టెస్టులు అందేలా చూడాలని నగర ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.