అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అడవుల్లో నిందితుడు ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు గాలించి పట్టుకున్నారు. అనంతరం ఘటన జరిగిన తీరును అడుగుతుండగా హేమంత్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో రాప్తాడు సీఐపై కత్తితో దాడికి యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, శనివారం ఉదయం రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బాలికపై హేమంత్ చెట్లు నరికే రంపం యంత్రంతో దాడి చేశాడు.
ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. దాడి తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన బాలికను తొలుత ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
